భారతదేశంలో భారీ యాంటీ డ్రగ్ ఆపరేషన్‌లో భాగంగా అరుదైన ‘క్యాప్టగాన్’ మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) వెల్లడించారు. ‘ఆపరేషన్ రేజ్‌పిల్’ పేరుతో నిర్వహించిన ఈ దాడిలో రూ.182 కోట్ల విలువైన క్యాప్టగాన్ డ్రగ్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు పట్టుకున్నారని తెలిపారు. ఈ డ్రగ్ సరుకు మధ్యప్రాచ్య దేశాలకు తరలించేందుకు సిద్ధం చేసినట్లు గుర్తించారు.
శనివారం ఈ విషయాన్ని ప్రకటించిన అమిత్ షా.. “డ్రగ్ ఫ్రీ ఇండియా” లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. “ఆపరేషన్ రేజ్‌పిల్ ద్వారా తొలిసారిగా ‘జిహాదీ డ్రగ్’గా పిలిచే క్యాప్టగాన్‌ను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నాం. మధ్యప్రాచ్యానికి తరలించేందుకు సిద్ధం చేసిన ఈ డ్రగ్ రాకెట్‌ను ఛేదించడంతో పాటు ఓ విదేశీ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశాం” అని పేర్కొన్నారు.
ఇక భారత భూభాగాన్ని ట్రాన్సిట్ రూట్‌గా ఉపయోగించి డ్రగ్స్ రవాణా చేయాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అమిత్ షా.. దేశంలోకి వచ్చే ప్రతి గ్రాము డ్రగ్‌పై, దేశం నుంచి వెళ్లే ప్రతి గ్రాము డ్రగ్‌పై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ ఆపరేషన్ విజయవంతం చేసిన ఎన్‌సీబీ అధికారులను ఆయన అభినందించారు.

క్యాప్టగాన్ అంటే ఏమిటి?
క్యాప్టగాన్ అనేది ఫెనెథిల్లైన్ అనే సింథటిక్ స్టిమ్యులెంట్‌కు సంబంధించిన స్ట్రీట్ నేమ్. దీనిని మొదట 1960లలో అభివృద్ధి చేశారు. ప్రారంభంలో దృష్టి లోపం, నార్కోలెప్సీ వంటి వైద్య సమస్యల చికిత్సకు ఉపయోగించేవారు. అయితే ఇది తీవ్రమైన వ్యసనానికి దారితీయడంతో అంతర్జాతీయంగా నిషేధించారు.
ప్రస్తుతం బ్లాక్ మార్కెట్‌లో లభించే ఎక్కువ భాగం క్యాప్టగాన్ మాత్రలు అక్రమంగా తయారవుతున్నాయి. వీటిలో అంఫెటమైన్, మెథాంఫెటమైన్, కాఫీన్ వంటి రసాయనాల మిశ్రమం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
‘జిహాదీ డ్రగ్’గా ఎందుకు పిలుస్తారు?
మధ్యప్రాచ్యంలోని ఘర్షణ ప్రాంతాల్లో పనిచేసే ఉగ్రవాద గ్రూపులు, నెట్‌వర్క్‌లతో ఈ డ్రగ్‌కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు, ఇంటెలిజెన్స్ నివేదికల కారణంగా దీనిని ‘జిహాదీ డ్రగ్’గా పిలుస్తున్నారు. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ డ్రగ్‌కు భారీ డిమాండ్ ఉండటంతో దీనిని “పేదవాడి కొకైన్” అని కూడా పిలుస్తారు.
గత దశాబ్దంలో అనేక అంతర్జాతీయ దర్యాప్తుల్లో, యుద్ధ ప్రాంతాల్లో ఆయుధ గుంపుల వద్ద క్యాప్టగాన్ మాత్రలు స్వాధీనం అయినట్లు నివేదికలు వెల్లడించాయి.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్యాప్టగాన్ మాఫియా
మధ్యప్రాచ్యంలో క్యాప్టగాన్ అక్రమ రవాణా ఇప్పుడు ప్రపంచస్థాయి సింథటిక్ డ్రగ్ ముప్పుగా మారిందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అక్రమ ప్రయోగశాలలు, హవాలా ఫండింగ్, నకిలీ వాణిజ్య పత్రాలు, సముద్ర మార్గాల ద్వారా స్మగ్లింగ్ వంటి పద్ధతులను డ్రగ్ మాఫియా ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తుల్లో బయటపడింది.
1980లలో చట్టబద్ధ తయారీ నిలిచిపోయినప్పటికీ, యూరప్, మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాల్లో అక్రమ తయారీ కొనసాగుతోందని నివేదికలు చెబుతున్నాయి.


