బీజేపీ నేత గజ్జల యోగానంద్(Gajjala Yoganand) పై సైబరాబాద్ పోలీసుల ఈవోడబ్ల్యూ (Economic Offences Wing) విభాగంలో మోసం కేసు నమోదైంది. వ్యాపార భాగస్వామ్యం పేరుతో ప్రవాస భారతీయుడిని మోసం చేసి కోట్ల రూపాయలు తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఫిర్యాదు వివరాల ప్రకారం, ప్రవాస భారతీయుడు పవన్‌కుమార్‌కు హోటల్ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని యోగానంద్ నమ్మించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వ్యాపార భాగస్వామ్యం పేరుతో ఆయన నుంచి దశలవారీగా రూ.24.53 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు.
అయితే డబ్బు తీసుకున్న తర్వాత ఒప్పందం ప్రకారం షేర్లు కేటాయించలేదని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఆ షేర్లు తాకట్టు పెట్టిన విషయాన్ని దాచిపెట్టి ఎంవోయూ (MoU) చేసుకున్నారని ఆరోపించారు.
డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినప్పుడు యోగానంద్ , ఆయన అనుచరులు బెదిరింపులకు దిగినట్లు కూడా పవన్‌కుమార్ ఆరోపించారు. దీంతో బాధితుడు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ అధికారులను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


