పెళ్లి సంబరాలతో కళకళలాడిన రెండు కుటుంబాల్లో ఒక్కసారిగా దుఃఖఛాయలు అలుముకున్నాయి. విశాఖ జిల్లాలో పెళ్లైన మరుసటి రోజే జరిగిన కారు ప్రమాదంలో నవ వధువు ప్రాణాలు కోల్పోయింది.
స్థానికుల వివరాల ప్రకారం.. అగనంపూడి ప్రాంతానికి చెందిన నరసింగరావుకు వాడచీపురుపల్లికి చెందిన రామేశ్వరితో బుధవారం రాత్రి వివాహం జరిగింది. వధువు ఇంట్లో జరిగిన వేడుక అనంతరం గురువారం మధ్యాహ్నం నూతన దంపతులు వరుడి ఇంటికి బయల్దేరారు.
అయితే అగనంపూడి సమీపానికి చేరుకోగానే వారి కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో వధువు రామేశ్వరి అక్కడికక్కడే మృతిచెందింది. వరుడు నరసింగరావుతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెళ్లి పారాణి ఆరకముందే నవ వధువు మృతిచెందడంతో స్థానికులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.


