కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ( Sonia Gandhi) గురుగ్రామ్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను బుధవారం ఉదయం మెదాంత ( Medanta – The Medicity) ఆస్పత్రిలో చేర్పించారు.
వైద్య వర్గాల సమాచారం ప్రకారం, స్వల్ప శస్త్రచికిత్స కోసం సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరగా ప్రస్తుతం పలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఈ ఏడాది జనవరి తర్వాత సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరడం ఇది మూడోసారి. గత మార్చిలో తీవ్ర జ్వరం రావడంతో ఆమెను ఢిల్లీలోని గంగారామ్ ( Sir Ganga Ram Hospital) లో చేర్చారు. అప్పట్లో ఆమెకు శరీరంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించి యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందించారు.
ఆ సమయంలో కొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఆమెను ఉంచారు. అంతకుముందు కూడా సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం అదే ఆస్పత్రిలో చేరి ఛెస్ట్ ఫిజీషియన్ పర్యవేక్షణలో చికిత్స పొందారు.
సోనియా గాంధీకి దీర్ఘకాలిక దగ్గు సమస్య ఉందని, ముఖ్యంగా ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటుంటారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
గత డిసెంబర్‌లో సోనియా గాంధీ 79వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.


