ప్రకాశం జిల్లా చీమకుర్తిలో గ్రానైట్ క్వారీలపై మైనింగ్ విజిలెన్స్ అధికారుల తనిఖీలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. అక్రమ తవ్వకాలు, అనుమతులకు మించి గ్రానైట్ వెలికితీత జరుగుతోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు.
చీమకుర్తిలోని శ్రీ సూర్య గ్రానైట్ క్వారీలో విజిలెన్స్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఒంగోలు మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టాయి.
రెండు ప్రత్యేక టీంలుగా ఏర్పడిన విజిలెన్స్ అధికారులు క్వారీలో ఉన్న గ్రానైట్ నిల్వలను కొలుస్తూ రికార్డులను సవివరంగా పరిశీలిస్తున్నారు. క్వారీకి ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకే తవ్వకాలు జరిగాయా? లేక పరిమితులకు మించి గ్రానైట్ వెలికితీశారా? అన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
అధికారులు ముఖ్యంగా… క్వారీ సరిహద్దులు, తవ్విన గుంతల లోతు గ్రానైట్ నిల్వల పరిమాణం, రవాణా రికార్డులు, రాయల్టీ చెల్లింపుల వివరాలు.. వంటి అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
అలాగే తవ్వకాల వల్ల పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించబడాయా? భద్రతా ప్రమాణాలు పాటించారా? అనే అంశాలపై కూడా విచారణ కొనసాగుతోంది.
ఈ తనిఖీల్లో అక్రమాలు జరిగినట్లు తేలితే భారీ జరిమానాలు విధించే అవకాశముందని మైనింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే లీజులను రద్దు చేసే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇక వరుస తనిఖీలతో స్థానిక గ్రానైట్ వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే అక్రమ తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరిస్తున్నారు.


