32.2 C
Hyderabad
Tuesday, May 12, 2026
spot_img

తమిళనాడులో మద్యం దుకాణాలపై విజయ్‌ సంచలన నిర్ణయం

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీసుకున్న తొలి కీలక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, పాఠశాలలు, బస్ స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 మద్యం దుకాణాలను మూసివేయాలని సీఎం విజయ్ ఆదేశాలు జారీ చేశారు.

రెండు వారాల్లోగా ఈ దుకాణాలను పూర్తిగా మూసివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తు, సామాజిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC)ఆధ్వర్యంలో మొత్తం 4,765 మద్యం దుకాణాలు పనిచేస్తున్నాయి. వాటిలో 276 దేవాలయాల సమీపంలో… 186 విద్యాసంస్థల దగ్గర… 255 బస్ స్టాండ్ల వద్ద ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇవన్నీ కలిపి మొత్తం 717 షాపులను మూసివేయనున్నారు.

ఎన్నికల ప్రచారంలో విజయ్ “అడిక్షన్ ఫ్రీ తమిళనాడు” లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ఆ హామీ అమలులో తొలి అడుగుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే మరోవైపు ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశముందని చర్చ జరుగుతోంది. ఎందుకంటే తస్మాక్ ద్వారా తమిళనాడు ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తోంది. 2025లో మాత్రమే తస్మాక్ ద్వారా రాష్ట్ర ఖజానాకు 48 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా… గత కొంతకాలంగా తస్మాక్ సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ — ED దర్యాప్తులో కూడా చిక్కుకుంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ED తమిళనాడులోని పలు తస్మాక్ కార్యాలయాలు, సంబంధిత సంస్థలపై దాడులు నిర్వహించింది.

తస్మాక్ కార్యకలాపాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఈడీ ఆరోపించింది. ముఖ్యంగా వెయ్యి కోట్ల రూపాయల అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో బయటపడినట్లు తెలిపింది.

అలాగే బార్ లైసెన్సులు, ట్రాన్స్‌పోర్ట్ టెండర్లు, కార్పొరేట్ పోస్టింగ్‌లలో అవకతవకలు జరిగాయని… కొందరు డిస్టిలరీలకు అనుకూలంగా టెండర్లు మలిచినట్లు ఇన్‌క్రిమినేటింగ్ డేటా దొరికిందని ఈడీ పేర్కొంది.

ఇంకా ఒక్కో మద్యం బాటిల్‌పై 10 నుంచి 30 రూపాయల వరకు అదనపు వసూళ్లు జరిగినట్లు… తస్మాక్ అధికారుల ప్రమేయంతో ఈ అక్రమాలు జరిగాయని ఈడీ ఆరోపించింది.

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ — PMLA కింద పది ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. టెండర్లలో మోసం జరిగిందని సూచించే మానిప్యులేటెడ్ డేటా కూడా దొరికినట్లు ఈడీ ప్రకటించింది.

అయితే అప్పట్లో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం ఈడీ చర్యలను తీవ్రంగా ఖండించింది. అప్పటి ఎక్సైజ్ మంత్రి ఎస్ ముత్తుస్వామి… ఈడీ రాజకీయ కక్షసాధింపుతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర అధికారులను కావాలనే వేధిస్తున్నారని… తస్మాక్ కార్యాలయాలపై దాడులకు రాజకీయ ఉద్దేశాలున్నాయని విమర్శించారు.

ఈ వివాదం చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నప్పుడు కేంద్ర సంస్థలు జోక్యం చేసుకోవడం ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధం కాదా? అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ఇప్పుడు ఈ మొత్తం వివాదాల మధ్య ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న తాజా నిర్ణయం తమిళనాడులో మద్యం నియంత్రణపై కొత్త చర్చకు దారి తీసింది. ప్రజా సంక్షేమం కోసమా… లేక రాజకీయ వ్యూహమా అన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది.

Latest Articles

రాజస్థాన్‌లో పేపర్‌ లీక్‌.. నీట్‌ యూజీ 2026 పరీక్ష రద్దు

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన నీట్ యూజీ-2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ — NTA రద్దు చేసింది. రాజస్థాన్‌లో ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్