అంటార్కిటికా ఖండం, అట్లాంటిక్ మహా సముద్రంలోని మారుమూల దీవులను సందర్శించడానికి ‘ఎంవీ హోండియస్’ క్రూయిజ్ నౌకలో బయల్దేరిన పర్యాటకులను హంటా వైరస్ బెంబేలెత్తిస్తోంది. ఈ వైరస్‌పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో భయం కూడా పెరుగుతోంది. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఇది మరో కరోనా తరహా మహమ్మారిగా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.
హాంటావైరస్ సోకిన వారిలో సుమారు 40 శాతం మంది వరకు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నెంబర్ వినగానే వైరస్ చాలా భయంకరంగా అనిపించినా, ఇది ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపించే పరిస్థితి లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కారణం.. ఈ వైరస్ మనుషుల మధ్య చాలా తక్కువగా వ్యాపిస్తుంది.
సాధారణంగా హాంటావైరస్ ఎలుకలు లేదా చుంచుల ద్వారా మనుషులకు సోకుతుంది. ముఖ్యంగా వాటి మలమూత్రాలు, ఉమ్మి లేదా అవి వదిలే సూక్ష్మ కణాలు గాలిలో కలిసినప్పుడు వాటిని పీల్చడం వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుంది. అంటే ఇది నేరుగా ఒక వ్యక్తి నుంచి మరొకరికి సులభంగా సోకే వైరస్ కాదు.
అయితే హాంటావైరస్‌లో ఆండీస్ స్ట్రెయిన్ అనే ప్రత్యేక రకం మాత్రం మనుషుల మధ్య వ్యాపించే సామర్థ్యం కలిగి ఉంది. కానీ అలాంటి కేసులు చాలా అరుదుగా నమోదయ్యాయి. అదీ కూడా చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తుల మధ్య మాత్రమే వ్యాప్తి జరిగినట్లు గుర్తించారు. అందుకే దీనిపై ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారు.
శాస్త్రవేత్తల ప్రకారం, అత్యంత ప్రాణాంతక వైరస్‌లు చాలా సందర్భాల్లో పెద్ద స్థాయిలో వ్యాపించలేవు. ఎందుకంటే వైరస్ సోకిన వ్యక్తులు త్వరగా తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. ఆసుపత్రి మంచానికే పరిమితమైతే, బయట తిరిగి మరెందరికో వైరస్ సోకించే అవకాశం తగ్గిపోతుంది.
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా మారడానికి ప్రధాన కారణం ఇదే. చాలామందికి వైరస్ సోకిన విషయం తెలియకుండానే వారు సాధారణ జీవితాన్ని కొనసాగించారు. ఉద్యోగాలకు వెళ్లడం, ప్రయాణాలు చేయడం, జనాల్లో కలవడం వల్ల కరోనా వేగంగా వ్యాపించింది. ఫ్లూ వైరస్ కూడా ఇలాగే పనిచేస్తుంది. తేలికపాటి లక్షణాలతో ప్రజలు బయట తిరగడం వల్ల వైరస్ సులభంగా వ్యాపిస్తుంది.
అంటే ప్రపంచానికి అసలు ప్రమాదం కలిగించేవి కేవలం అత్యంత ప్రాణాంతక వైరస్‌లు మాత్రమే కావు. స్వల్ప లక్షణాలతో, తెలియకుండా మనుషుల మధ్య నిశ్శబ్దంగా వ్యాపించే వైరస్‌లే పెద్ద మహమ్మారులకు కారణమవుతాయి.
హాంటావైరస్ చాలా ప్రమాదకరమైనదే అయినప్పటికీ, దాని వ్యాప్తి పరిమితంగా ఉండటం వల్ల ఇది ప్రస్తుతం ప్రపంచ మహమ్మారిగా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఎలుకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించడం, మలమూత్రాల దగ్గర జాగ్రత్తగా వ్యవహరించడం, అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


