తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం భారీ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే 108 స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 118కు మరో 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఈ క్రమంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే అధినేత విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అపాయింట్‌మెంట్ కోరినట్లుగా తెలుస్తోంది . టీవీకే తరఫున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో కలిసి కాసేపట్లో విజయ్ గవర్నర్ ను కలవనున్నట్టు తెలుస్తోంది.
తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే రాజకీయాలకు బ్రేక్ పడింది. హీరో విజయ్ టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సంచలనం సృష్టించింది. మొట్టమొదటి ఎన్నికల్లోనే సింగిల్‌గా 108 సీట్లను కైవసం చేసుకొని ప్రధాన పార్టీలను వెనక్కి నెట్టేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118కి అతిస్వల్ప దూరంలో నిలిచింది. ఈ తరుణంలో మరో 10 నుంచి 12 సీట్లను కూడగట్టేందుకు ఇతర పార్టీల వైపు టీవీకే అధినేత విజయ్ చూస్తున్నారు. దీంతో చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయమని స్పష్టమవుతోంది.
గత 60 ఏళ్లుగా తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు మాత్రమే ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. చివరి రెండు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే, డీఎంకే స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ ఈసారి డీఎంకే, అన్నా డీఎంకేలకు షాకిచ్చేలా హీరో విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ విజయ దుందుభి మోగించింది. 100కుపైగా సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ 118ని సాధించేందుకు 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేల మద్దతు టీవీకే పార్టీకి అవసరం. ఒక కొత్త రాజకీయ పార్టీ తొలి ప్రయత్నంలోనే హంగ్ సర్కారు ఏర్పాటుకు వెళ్లడం తమిళ రాజకీయాల్లో ఇదే తొలిసారి.
2006లో ఎం. కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే 96 సీట్లు మాత్రమే గెల్చుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం డీఎంకేకు బయటి నుంచి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఆ ఐదేళ్ల పాటు రాష్ట్రంలో మైనారిటీ ప్రభుత్వం నడిచింది. ఈసారి కూడా హీరో విజయ్ ఇదే రీతిలో హంగ్ సర్కారును ఏర్పాటు చేయనున్నారు. అయితే ఆయనకు మద్దతివ్వనున్న పార్టీ ఏది అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
టీవీకేకు కేవలం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తే చాలు. ఇందుకోసం టీవీకే అధినేత విజయ్ స్వతంత్రంగా గెల్చిన అభ్యర్థులు, చిన్న పార్టీలు, డీఎంకే కూటమిలోని అసంతృప్త పార్టీల మద్దతు కోసం చర్చలను మొదలుపెట్టారు. ఈ చర్చల కోసం కొందరు పార్టీ ముఖ్య నేతలను ఆయన రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థులు, వామపక్షాలు, వీసీకే పార్టీతో విజయ్ చేతులు కలిపే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. జాతీయ స్థాయిలోని విపక్ష ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న డీఎంకేను కాదని, టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ సాహసించకపోవచ్చు. ప్రతిపక్ష అన్నాడీఎంకే ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిలో ఉంది. డీఎంకేను అధికారానికి దూరంగా ఉంచేందుకు విజయ్‌కు బయటి నుంచి మద్దతు ఇచ్చేందుకూ అన్నాడీఎంకే సిద్ధపడొచ్చని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.
స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూడా మిత్రపక్షాలను కాపాడుకోవడానికి యత్నించే అవకాశాలు ఉన్నాయి. స్వతంత్రులు, చిన్న పార్టీలను తమ వైపు తిప్పుకునేందుకు స్టాలిన్ అండ్ టీమ్ కసరత్తు చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేనందున, ఎమ్మెల్యేలతో క్యాంప్ పాలిటిక్స్ జరిగే ముప్పు ఉందనే ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ అలర్ట్ అయ్యారు. చెన్నైలోని పనైయూర్‌లో ఉన్న తన కార్యాలయంలో టీవీకే ముఖ్య నేతలతో ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఇతర పార్టీలు తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టకుండా ఉండేందుకు, గెలిచిన వారిని ఒక సురక్షిత రిసార్ట్‌కు తరలించే యోచనలో విజయ్ ఉన్నట్లు తెలుస్తోంది.


