తెలంగాణ ప్రజలను నిర్మాత, ఫిల్మ్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు క్షమాపణలు కోరారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన నేపథ్యంలో తాజాగా క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలు బాధిస్తే రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. తనకు తెలంగాణను హేళన చేసే ఉద్దేశ్యం లేదని చెప్పారు.
నిజామాబాద్ జిల్లా వాసిగా తన సినిమా ఈవెంట్ అక్కడ చేశానని చెప్పారు. ఆ ఈవెంట్‌లో మన సంస్కృతిలో ఉండే దావత్ గురించి మాట్లాడానని అన్నారు. తెలంగాణ వాళ్లను తాను అవమానించానని, హేళన చేశానని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతికి తాను అభిమానిని అన్న దిల్ రాజు.. బాన్సువాడలోనే ‘ఫిదా’ చిత్రాన్ని తెరకెక్కించాచని గుర్తు చేశారు. ఆ సినిమా తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేసిందని చెప్పారు. ‘బలగం’ చిత్రాన్ని తెలంగాణ సమాజం మొత్తం ఆదరించిందని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ‘బలగం’ చిత్రాన్ని అభినందించాయని… తెలంగాణ వాసిగా ఈ రాష్ట్రాన్ని హేళన చేయాలనే ఉద్దేశం తనకు లేదని దిల్ రాజు పేర్కొన్నారు.