నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు, కలుసుకున్న ప్రతి రేయి, కార్తీక పున్నమి రేయి…కాపురం కొత్త కాపురం, నువ్వు నేను ఏకమైనాము, ఇద్దరమూ మన మిద్దరమూ ఒక లోకమైనాము.. లోకమంతా ఏకమైనా వేరు కాలేమో… ఇలా బోల్డు బోల్డు పాటలు, హుషార్లు, షికార్లతో భావిజీవితం గడపడానికి ముడిపడి ఉండేది పరిణయం. వధూవరులు, భార్యభర్తలు అయ్యే సమయంలో సైంధవుడిలా అడ్డుపడే వాళ్లుంటే.. ఎవరికైనా ఒళ్లు మండిపోతుంది. ఆ గిట్టని వాళ్లకు తిట్లు, శాపనార్థాలు, ధూషణ అక్షంతలు, దేహశుద్ధిలు వగైరా, వగైరా తిరస్కార సన్మానాలన్ని చేసేస్తారు. పరిస్థితి కామ్ అయ్యాక పెళ్లి పెద్దలందరూ వాళ్ల వాళ్ల సీట్లలో కూర్చుని, పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్లను చక్కగా పెళ్లిపీటల మీద కూర్చోబెట్టేస్తారు. మాంగల్యం తంతునానేన తంతో, ఉంగరాలు మార్చుకునే వేడుకో, మరో రీతిలోను పరిణయ తంతు ముగించేస్తారు. పెద్దలందరూ ఆశీర్వదించేస్తారు. అయితే, ఇక్కడ ఓ సైంధవి అడ్డుపడింది. అయితే, ఆ సైంధవి పుంలింగ, స్త్రీలింగాలకు చెందింది కాదు. అలాగని నపుంసక లింగాని చెందింది కాదు. మరెవరు…ఏమిటీ విడ్డురం అని అడుగుతున్నారు కదూ..! ఈ సైంధవి ఓ నృత్యం. ఇది మరీ చోద్యంలా ఉంది.. డ్యాన్స్ ఏమిటి సైంధవి ఏమిటి..? అని ఆశ్చర్యపడుతున్నారు కదూ…అయితే, ఈ వింత తంతు అంతా చూడాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్.. ఇందులో డ్యాన్స్ ను క్యాన్సిల్ జయించేసింది.
పండగొచ్చినా పబ్బమొచ్చినా, శుభకార్యమైనా, పెళ్లయినా…సరదాగా సందడిగా, కేరింతాలు కొడుతూ ఆనందంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. పెద్దలు సైతం పిల్లలుగా మారి ఈ వేడుకల్లో పాటలు పాడుతూ, గెంతులు గెంతుతూ, డ్యాన్సులు, స్టెప్పులతో సరదాగా గడుపుతారు. ఇదో మధురానుభూతిగా చెబుతారు. అయితే, శృతిమించి రాగాన పడి అశ్లీల నృత్యాలు, అవాంఛనీయ గెంతులు వేస్తే.. సదరు గ్యాంగ్ కు కాస్త చివాట్లు పెట్టి ఆ శుభకార్యాల తంతులు పూర్తయ్యేలా చూస్తారు. శుభకార్యాలే కాదు పండువలు, నవరాత్రి ఉత్సవాల్లోనూ ఈ డ్యాన్సుల తంతు భారీగానే ఉంటుంది. అంతా సవ్యంగా, సరదాగు ఉంటుంది తప్ప అశ్లీలంగా, జుగుప్సాకరంగా ఏమీ ఉండదు. అయితే, మరీ సంప్రదాయబద్ధంగా కాదు కాని సినిమా స్టయిల్లో ఓ సినిమా పాటకు వరుడు స్టెప్పులేశాడని.. వధువు తరఫువారు పెళ్లి క్యాన్సిల్ చేసి పారేశారు. ఇదేం చర్య బాబోయ్.. అందరి పెళ్లికొడుకులు డ్యాన్స్ మాదిరే తాను డ్యాన్స్ చేశానని, ఏదో సరదాగా చేసినదానికి ఏదో దేవదాసు, లైలామజ్నూల సినిమా మాదిరి డెసిషన్లు తీసేసుకుని.. తనని రోమియో మాదిరి చూసేసి, పెళ్లి క్యాన్సిల్ చేసేస్తే.. ఇప్పడు నేనేమై పోవాలి, మా తల్లిదండ్రుల పరువేమైపోవాలి, ఆడపిల్ల పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని మీ పరువేమైపోవాలి.. అని అందరి తరఫునా ఆ వరుడు ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్నాడు.
దేశ రాజధాని కొత్త ఢిల్లీలో పాత సంప్రదాయాలు పాటించే ఓ వధువు కుటుంబీకులకు వరుడు చేసిన చిన్న పనికి పెద్ద ఎత్తున కోపం వచ్చేసింది..పెళ్లికి ముందు మండపం దగ్గర వరుడు నృత్యాలు చేశాడని, ఫ్రెండ్స్ తో కలిసి గెంతులు గెంతాడని వివాహాన్ని రద్దు చేసిపారేశారు. ఢిల్లీ మహానగరంలో పెళ్లికొడుకు ఆయన హితులు, సన్నిహితులు, బంధువులు ఊరేగింపుగా వచ్చారు. అయితే, పెళ్లికుమారుడు బుద్దిగా, పెళ్లికూతురు మాదిరి సిగ్గుపడుతూ.. అందరితో కలిసి నెమ్మదిగా వస్తున్నాడు. స్నేహితులు సినిమా పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ పెళ్లి మండపానికి వస్తున్నారు. ఇంతలో వరుడి మిత్రబృందం.. మిత్రమా.. నువ్వు రంగంలోకి దిగు. నీ డ్యాన్స్ తో వాతావరణం మరింత ఉత్సాహంగా మారుతుందని అన్నారు. ఇది బాగోదేమో అని తొలుత సంశయించిన పెళ్లికొడుకు.. స్నేహితుల ఒత్తిడి, బలవంతంతో.. చివరికి డ్యాన్స్ చేయడానికి రెడీ అయ్యాడు.
చోళీ కే పీచే క్యా హై పాటకు ఉల్లాసంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. ఈ డ్యాన్స్ వ్యవహారం చూసి వధువు తండ్రి ఉగ్రుడైపోయి, ఊగిపోయి చిందులు తొక్కాడు. ఈ పని కానిపని, ఈ అనుచితాన్ని సహించేది లేదు.. పెళ్లి క్యాన్సిల్ అన్నాడు. వరుడు, వాళ్ల ఫ్రెండ్స్ డ్యాన్స్ వ్యవహారం తమ కుటుంబ విలువలు అవమానించేలా ఉన్నాయని అన్నాడు. పెళ్లికొడుకు, ఆయన బంధువులు ఎంత బతిమాలినా నో కాంప్రమైజ్.. అనేశాడు. పెళ్లికొడుకు బంధువుల బతిమలాట, పెళ్లి కూతురి తండ్రి బింకంమాట.. అన్నీ చూస్తున్న బంధుగణం.. ఇంతకీ పెళ్లి ఉన్నట్టా.. లేనట్టా… పట్టుచీరలు కట్టుకోవాలా లేదా అని నారీశిరోమణులు… లాల్చీ, ధోవతి వేసుకోవాలా ఫేంటు, షర్టుల్లో మెరిసిపోవాలా, ప్రయాణ బట్టలే కట్టుకోవాలా అని తర్జన భర్జన పడుతున్నారు. చివరికి ప్రయాణలకే బయల్దేరాల్సి పరిస్థితి రావడంతో ఢీలా పడిపోయారు. విందు భోజనాలు, పెళ్లి కిళ్లీలు అన్నింటికీ దూరమై ఇంటి బాట పట్టారు. చీమ చిటుక్కు మంటేనే ఎలర్ట్ అయ్యే సోషల్ మీడియా.. ఇంత పెద్ద గొప్ప ఈవెంట్ జరిగితే గోళ్లు గిల్లుకుంటూ కూర్చుదు కదా…! ఈ ఎపిసోడ్ మొత్తం సాంఘిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతోంది.