దేశ చరిత్రలో ఇటీవల మధ్యప్రదేశ్ భోపాల్ కేంద్రంగా వెలుగుచూసిన అవినీతి కేసు అత్యంత సంచలనం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లిన ఓ ఎస్‌యూవీలో 52 కిలో గ్రాముల బంగారం , రూ .11 కోట్ల నగదును గుర్తించారు. ఈ కారు ఎవరిది..? ప్రస్తుతం ఇదే ప్రశ్న తలెత్తుతుంది. ఇంత వరకు ఈ కేసును ఛేదించలేకపోయారు.
సౌరభ్ శర్మ.. మధ్యప్రదేశ్ రవాణాశాఖలో మాజీ కానిస్టేబుల్. ఇతనిపైనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి), ఆదాయపు పన్ను విభాగం (ఐటి), రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) డైరెక్టరేట్, లోకాయుక్త పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది డిసెంబర్‌లో తనిఖీలతో సౌరాబ్ శర్మ పతనం ప్రారంభమైంది. ఆయన ఇంట్లో నగదు, ఆభరణాలు, ఆస్తి పత్రాలతో సహా దాదాపు 8 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. ఆ తర్వాత భోపాల్ సమీపంలోని మెన్డోరి అడవిలో గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసిన తెల్లటి టయోటా ఇన్నోవాలో 52 కిలోల బంగారం, రూ .11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఒక అవినీతి అధికారిపై ప్రారంభమైన దర్యాప్తు.. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని సీనియర్ ప్రభుత్వ అధికారులు, రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో అవినీతి నెట్‌వర్క్‌ను బట్టబయలు చేసింది.
కోర్టు పత్రాల ప్రకారం.. లోకాయుక్త రిపోర్టుల్లో సీజ్ చేసిన నగదు, బంగారంలో పొంతనే లేదు. ఇదే గందరగోళానికి దారి తీసింది. ప్రారంభంలో చెప్పిన దాని ప్రకారం రూ .7.98 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. తర్వాత రూ .55 లక్షలు మాత్రమే సీజ్ చేసినట్టు ఓ డీఎస్పీ స్థాయి అధికారి చెప్పారు.
ఈ పొంతన లేని స్టేట్‌మెంట్స్ వల్ల దర్యాప్తుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అవినీతి నిరోధక శాఖ దర్యాప్తులో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం స్పష్టంగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పీఎంఎల్‌ఏ యక్ట్ కింద ఈడీ అధికారులు కొన్ని కీలక అంశాలపై ఫోకస్ చేశారు.
ఈ కేసును పలు ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నా.. వదిలిపెట్టిన డబ్బు, నగదును తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. కారు సౌరభ్ శర్మ సన్నిహితుడు చేతన్ సింగ్ గౌర్ పేరు మీద రిజిస్టర్ అయింది. అయితే చేతన్ సింగ్ గౌర్ .. ఇందులో తన ప్రమేయం లేదని చెబుతున్నాడు. ఈ వాహనాన్ని గుర్తు తెలియని డ్రైవర్‌కు అద్దెకు ఇచ్చానని పేర్కొన్నాడు.
శర్మ ఇంట్లో తనిఖీలు జరిగిన రోజు రాత్రి.. సీసీటీవీ ఫుటేజిలో ఇంటికి సమీపంలో ఆ కారును గుర్తించారు. లోకయుక్త పోలీసులు కారును గుర్తించడంలో విఫలమయ్యారు కాబట్టే.. కారును అడవుల్లో వదిలేసినట్టుగా అనుమానిస్తున్నారు. సాక్ష్యాలతో సహా డబ్బు, నగదును దూరంగా వదిలేయడానికి అంతర్గత వ్యక్తులు కీలకంగా వ్యవహరించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మధ్యప్రదేశ్ పరిధిని దాటి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అక్రమంగా బంగారాన్ని రవాణా చేసే ముఠాలకు ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయా అనే దానిపై దృష్టి పెట్టారు. శర్మ ఆర్థిక లావాదేవీలను బట్టి ఆయనకు దుబాయ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియాతో సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని జ్యూడిషియల్ దర్యాప్తుకు మాజీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో.., ఈ కేసు దర్యాప్తుపై విమర్శలు చేశారు. ఈడీ, ఐటీ విభాగం దర్యాప్తుపై ప్రత్యేక నియంత్రణ ఉండాలని చెప్పారు.