అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ను ఎంపిక చేశారు. మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులందరూ కలిసి ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపారు. అదే సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ జెడీ వాన్స్ పేరును ప్రకటించారు ట్రంప్. దీంతో నవంబరులో జరగబోయే ఎన్నికకు రిపబ్లికన్ పార్టీ తరఫున కీలక నేతల అభ్యర్థిత్వాలు ఇప్పటికే ఖరారైనట్లైంది.
ఎంతో ఆలోచించి, అందరి యోగ్యతలను మదించిన తర్వాతే ఉపాధ్యక్ష పదవికి వాన్స్ తగిన వ్యక్తి అని రిపబ్లిక్ పార్టీ నిర్ణయించిందని సోషల్ మీడియాలో తెలిపారు ట్రంప్. మెరైన్ విభాగంలో అమెరికాకు ఆయన సేవలందించారని.. ఒహాయో స్టేట్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన వాన్స్ యేల్ లా విశ్వవిద్యాలయం పట్టభద్రుడని పేర్కొన్నారు. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో విజయవంతమైన వ్యాపారవేత్త అని రాసుకొచ్చారు. 39 ఏళ్ల వాన్స్ 2022లో మెుదటి సారిగా అమెరికా సెనేట్‌కు ఎన్నికయ్యారు. భారత సంతతి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉషా చిలుకూరిని వాన్స్ వివాహమాడారు.


