కేంద్రంలో మరోసారి ఎన్డీఏదే అధికారమని తేల్చాయి ఎగ్జిట్ పోల్స్. ఎన్డీయే కూటమి తక్కువలో తక్కువగా 281 సీట్లు, అత్యధికంగా 392 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని తేల్చాయి. ఇక, ఇండియా కూటమికి 118 నుంచి 154 సీట్ల వరకు దక్కవచ్చని లెక్కలేశాయి.
రిపబ్లిక్-పీమార్క్ ఎగ్జిట్‌పోల్ ప్రకారం ఎన్డీఏకు 359 సీట్లు దక్కవచ్చని తెలిపింది. ఇండియా కూటమికి 154 ఎంపీ స్థానా లు, ఇతరులకు మరో 30 సీట్లు దక్కవచ్చని అంచనా వేసింది. రిపబ్లిక్ భారత్- మ్యాట్రిజ్ ప్రకారం ఎన్డీయేకు 353 నుంచి 368 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇండియా కూటమికి 118 నుంచి 133 సీట్లు వస్తాయని లెక్కలేసిం ది. ఇతరులకు 43 నుంచి 48 పార్లమెంటు స్థానాలు వస్తాయని తెలిపింది. జన్‌కీ బాత్ ఎగ్జిట్ పోల్స్‌లోనూ ఎన్డీయే కూటమికి 362 నుంచి 392 స్థానాలు వస్తాయని ప్రకటించింది. ఇండియా కూటమికి 141 నుంచి 161 సీట్లు వస్తాయని లెక్కలేసింది. ఇతరులకు పది నుంచి 20 ఎంపీ స్థానాలు రావచ్చన్న అంచనాలు ప్రకటించింది. దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్‌లోనూ ఎన్డీఏ విజయ ఢంకా మోగించింది. 281 నుంచి 350 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది. ఇండియా కూటమికి 145 నుంచి 201 సీట్ల మధ్య రావచ్చని తెలిపింది. ఇతరులకు 33 నుంచి 49 సీట్లు వస్తాయని అంచనా వేసిం ది. మొత్తంగా చూస్తే కమలం నేతలు చెప్పినట్లుగా 400 మార్క్ చేరకపోయినా…మరోసారి మోడీ మ్యాజిక్ మాత్రం లోక్‌సభ ఎన్నికల్లో పనిచేసిందన్న మాట గట్టిగా విన్పిస్తోంది.


