ఉత్కంఠ భరితంగా సాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీదే మరోసారి అధికారమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. మే 13న పోలింగ్ జరిగిన నాటి నుంచీ ఓటర్లు ఎటువైపు మొగ్గారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందా లేదంటే కూటమి విజయం సాధిస్తుందా అని పెద్ద ఎత్తున చర్చ సాగింది. అయితే సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ ముగియడంతో వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో వైసీపీ హవా స్పష్టంగా కన్పించింది.
ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఏపీ ప్రజలు మళ్లీ వైసీపీకే పట్టం గట్టనున్నారు. వైనాట్ 175 అంటూ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడంపై మొదటి నుంచీ ఫోకస్ పెట్టిన వైసీపీ, 98 నుంచి 116 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉందని ఆత్మసాక్షి తెలిపింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 59 నుంచి 77 స్థానాలు గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. మరోవైపు ఏపీలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ వైసీపీ హవా కొనసాగినట్లు ఆత్మసాక్షి అంచనా వేసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ 16, టీడీపీ 6, జనసేన 1, బీజేపీ 1, ఇతరులు 1 స్థానం గెలుచుకుంటాని వెల్లడించింది. అంటే కూటమి 8 స్థానాలకే పరిమితం కానుంది.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిదే విజయమని తేల్చింది. ఐదేళ్ల వైసీపీ పాలనపై ప్రజలు విస్పష్టంగా తీర్పునిచ్చారని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది. కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న టీడీపీకి 95 నుంచి 110 సీట్లు వస్తాయని ప్రకటించింది. జనసేనకు 14 నుంచి 20 సీట్లు, బీజేపీకి 2 నుంచి ఐదు స్థానాలు దక్కుతాయని తేల్చింది. తద్వారా కూటమికి 111 నుంచి 135 సీట్ల వరకు వస్తాయని తన అంచనాలో ప్రకటించింది. అధికార వైసీపీకి ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదని తేల్చి చెప్పింది పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్. వైసీపీకి 45 నుంచి 60 సీట్లు మాత్రమే వస్తాయని తమ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందని ప్రకటించింది. వైసీపీ పాలనలో సంక్షేమ పథకాల అమలు తప్ప పారిశ్రా మికంగా అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగాల కల్పనలో ఏపీ సర్కారు విఫలమైందన్న విపక్షాల విమర్శల నేపథ్యంలో వైసీపీకి ఓటమి తప్పదని తమ ఎగ్జిట్ పోల్‌లో వెల్లడైందంటూ ప్రకటించింది.
ఎంపీ స్థానాల విషయానికి వస్తే.. టీడీపీకి 13 నుంచి 15 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్. జనసేనకు రెండు, బీజేపీకి రెండు నుంచి నాలుగు పార్లమెంటు స్థానాలు వస్తాయని లెక్కలే సింది. ఇక వైసీపీకి మూడు నుంచి ఐదు మాత్రమే ఎంపీ సీట్లు వస్తాయని తేల్చింది పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్
స్వతంత్ర పయనీర్ సంస్థ జరిపిన సర్వేలో ఓటర్లు వైసీపీకే పట్టం కట్టారు. వైసీపీ అధినేత జగన్ అనుకున్నట్లుగానే సంక్షేమ పథకాలు ప్రజలను ఆకట్టుకున్నాయని స్వతంత్ర పయనీర్ సర్వే ప్రకారం తెలుస్తోంది. స్వతంత్ర పయనీర్ సర్వేలో వైసీపీ 95 నుంచి 105 సీట్లు సాధిస్తుందని తేలింది. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 70 నుంచి 80 సీట్లు సాధించే అవకాశం ఉంది.రేస్ ఎగ్జిట్ పోల్.. అధికార వైసీపీకి బంపర్ మెజార్టీ కట్టబెట్టింది. 122 నుంచి 127 స్థానాల్లో జగన్ పార్టీ విజయం సాధిస్తుం దని తెలిపింది. తిరుగులేని మెజార్టీతో మరోసారి అధికారం కైవసం చేసుకుంటుందని తెలిపింది రేస్ ఎగ్జిట్ పోల్.ఇక, టీడీపీ కూటమికి 53 నుంచి 58 స్థానాలు వస్తాయని పేర్కొంది. టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు కలిసి కట్టుగా పోటీ చేసినా పరాజయం తప్పదని తేల్చింది రేస్ ఎగ్జిట్ పోల్.
పోల్స్ మైండ్స్ ఎగ్జిట్ పోల్‌లోనూ వైసీపీ హవా స్పష్టంగా కన్పించింది. వైసీపీకి 116 నుంచి 134 స్థానాలు వస్తాయని లెక్కలేసింది. ఇక, టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 47 నుంచి 65 స్థానాలు వస్తాయని తేల్చింది.లోక్‌సభ స్థానాల విషయానికి వస్తే, వైసీపీకి 16 నుంచి 20 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది పోల్స్ మైండ్స్ ఎగ్జిట్ పోల్. టీడీపీ కూటమికి నాలుగు నుంచి ఐదు ఎంపీ సీట్లు మాత్రమే రావచ్చని తెలిపింది.
ఫస్ట్ స్టెప్ ఎగ్జిట్ పోల్స్‌లో వైసీపీదే విజయమని తేలింది. ఏపీలో అధికార వైసీపీకి 114 నుంచి 124 సీట్లు వస్తాయని అంచనా వేసింది. టీడీపీ కూటమికి 50 నుంచి 62 సీట్లు దక్కవచ్చని తెలిపింది.ఇక, పార్లమెం టు స్థానాల విషయానికి వస్తే, వైసీపీకి 17 నుంచి 20 ఎంపీ సీట్లు, టీడీపీ కూటమికి ఐదు నుంచి ఎనిమిది స్థానాలు వస్తాయని అంచనా వేసింది.సునీల్ వీర్ అండ్ టీమ్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌లో నూ వైసీ పీ హవా స్పష్టంగా కన్పించింది. దాదాపు 92 సీట్లలో విజయం సాధిస్తుందని ప్రకటించింది. టీడీపీ కూటమికి 79 సీట్ల వరకు వస్తాయని తెలిపింది.
లోక్‌సభ ఎన్నికల్లోనూ వైసీపీదే పైచేయి అని తేల్చింది సునీల్ వీర్ అండ్ టీమ్. వైసీపీకి 15 నుంచి 17 ఎంపీ సీట్లు, టీడీపీకి ఆరు నుంచి ఏడు స్థానాలు దక్కవచ్చని తెలిపింది.పొలిటికల్ లేబరేటరీ ఎగ్జిట్ పోల్స్‌లో వైసీపీ హవా వీచింది. వైసీపీకి 108 నుంచి 113 స్థానాలు వస్తాయని తేల్చింది. టీడీపీ కూటమికి 67 నుంచి 72 స్థానాలు దక్కవచ్చని అభిప్రాయపడింది. లోక్‌సభ ఎంపీ స్థానాల విషయానికి వస్తే, వైసీపీకి 11 స్థానాల వరకు రావచ్చని తెలిపింది. టీడీపీ కూటమికి 14 స్థానాల వరకు రావచ్చని తేల్చింది.మొత్తంగా చూస్తే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఏపీలో వైసీపీదే అధికారం అని తేల్చిచెప్పాయి.


