మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గం యావత్ దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బారామతి అంటే మరాఠా దిగ్గజం శరద్ పవార్ అడ్డా. శరద్ పవార్ పూర్వీకులు మహారాష్ట్రలోని సతారా ప్రాంత వాసులు. సతారా నుంచి పవార్ తాత ముత్తాతలు బారామతికి వచ్చి స్థిరపడ్డారు. బారామతి కార్యక్షేత్రంగా చేసుకుని శరద్ పవార్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.
కిందటేడాది మే నెలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నిట్టనిలువునా చీలిపోయింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూగా ఉన్న అజిత్ పవార్ పార్టీ అధినేత శరద్ పవార్‌పై తిరుగుబాటు చేశారు. తన వర్గం ఎమ్మెల్యేలతో వెళ్లి బీజేపీ శిబిరంలో చేరారు. దీంతో మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్‌కు చోటు లభించింది. అజిత్ పవార్ అంటే ఎవరో కాదు. శరద్ పవార్ సోదరుడి కుమారుడే. నిన్నటివరకు బాబాయ్ వర్సెస్ అబ్బాయ్‌లా ఉన్న ఎన్సీపీ రాజకీయాలు బారామతి లోక్‌సభ ఎన్నిక నేపథ్యంలో వదినా మరదలి మధ్య పోరుగా మారింది. మూడో విడతలో భాగంగా మే ఏడో తేదీన బారామతి లోక్‌సభకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో శరద్ పవార్ కుటుంబ సభ్యులే ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. ఒకవైపు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ బరిలో ఉన్నారు. సునేత్ర పవార్‌కు పర్యావరణం అత్యంత ఇష్టమైన అంశం. మనదేశానికి ఎకో విలేజ్ కాన్సెప్ట్‌ను పరిచయం చేసిన అతి కొద్దిమందిలో సునేత్ర పవార్ ఒకరు. విద్యారంగంపై కూడా ఆమెకు ఆసక్తి ఎక్కువ. విద్యా ప్రతిష్టాన్ పేరుతో ఓ పేరొందిన సంస్థకు ప్రస్తుతం సునేత్ర ట్రస్టీగా ఉన్నారు. పరిశుభ్రతగా మారుపేరుగా నిలిచే నిర్మల్ గ్రామ్ ఉద్యమాన్ని మహారాష్ట్రలో ఆమె ప్రారంభించారు.మహారాష్ట్రలోని మొత్తం 86 గ్రామాల్లో నిర్మల్ గ్రామ్ ఉద్యమం సత్ఫలితాలనిచ్చింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ గ్రూప్ సుప్రియా సూలే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ గ్రూపు నుంచి పోటీలో ఉన్నారు.ముంబైలోని జైహింద్ కాలేజీలో సుప్రియ బీఎస్సీ చదివారు. ఆ తరువాత తండ్రి శరద్ పవార్ వారసురాలిగా రాజకీయాల్లోకి సుప్రియ ప్రవేశించారు. 2009లో మొదటిసారి బారామతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. లోక్‌సభలోకి అడుగుపెట్టారు. 2014లో లోక్‌సభలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకురాలిగా సుప్రియ వ్యవహరిం చారు. 2023 వరకు లోక్‌సభలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ నేషనల్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మహారాష్ట్రలోని చురుకైనా రాజకీయ నాయకుల్లో ఒకరిగా ఆమె పేరు తెచ్చకున్నారు. శరద్ పవార్‌పై బారామతి ప్రజలకున్న అభిమా నమే తనను గెలుపుతీరాలకు చేరుస్తుందంటున్నారు సుప్రియా సూలే. మొత్తంమీద బారామతి పోరు అందరినీ ఆకట్టుకుంటోంది.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దాదాపు ఇరవై ఏళ్ల తరువాత లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. బీజేపీకి పెట్టనికోటలాంటి విదిశ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని చౌహాన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ ఈసారి తన స్వంత నియోజక వర్గమైన రాజ్‌గఢ్ నుంచి పోటీ చేస్తున్నారు. కొన్ని దశాబ్దాల తరువాత దిగ్విజయ్ సింగ్ రాజ్‌గఢ్ నుంచి పోటీలో నిలబడ్డారు. 2014,2019 ఎన్నికల్లో రాజ్‌గఢ్ నుంచి బీజేపీ అభ్యర్థులే గెలుపొందారు. ఈ నేపథ్యంలో గెలుపు కోసం దిగ్విజయ్ సింగ్ తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. కాగా మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై జ్యోతిరాదిత్య సింధియా బరిలో ఉన్నారు. రాజకుటుంబం నుంచి వచ్చిన జ్యోతిరాదిత్య సింధియా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై గుణ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ తరువాత ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన వెంటనే జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్రమంత్రి పదవి ఇచ్చి గౌరవించింది బీజేపీ. ఈసారి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్న రావ్ యాదవేంద్ర సింగ్‌తో తలపడుతున్నారు సింధియా.
ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి మైన్‌పురి నియోజకవర్గం పెట్టని కోటలాంటిది. 1996 నుంచి మైన్‌పురిలో ములాయం సింగ్ యాదవ్ గెలుస్తూ వస్తున్నారు. మధ్యలో మూడు సార్లు ఇతరులు గెలిచారు. 2022లో ములాయం సింగ్ యాదవ్ మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో డింపుల్ యాదవ్ గెలుపొందారు. ఈసారి డింపుల్ యాదవ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి జైవీర్ సింగ్ అలాగే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి శివ్ ప్రసాద్ యాదవ్ బరిలో ఉన్నారు. మైన్‌పురిలో అనుకున్నంత అభివృద్ధి జరగలేదని స్థానికుల్లో అసంతృప్తి ఉంది. అయితే ములాయం సింగ్ కోడలిగా డింపుల్‌కు ప్రజల్లో గుడ్‌విల్ ఉంది. ఈ గుడ్విలే తనను గెలుపు తీరాలకు చేరుస్తుందని డింపుల్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గోవాలోని ప్రముఖ పారిశ్రామిక కుటుంబం నుంచి వచ్చిన పల్లవి డెంపో ఈసారి లోక్‌సభ బరిలో నిలబడ్డారు. దక్షిణ గోవా సెగ్మెంట్ నుంచి బీజేపీ టికెట్‌పై పల్లవి డెంపో బరిలో ఉన్నారు. మొత్తంమీద మూడో విడత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు.


