బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై తీర్పును కోర్టు వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు పూర్తికాగా తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. అయితే, మరోమారు తీర్పును వాయిదా వేస్తున్న కోర్టు తెలిపింది. ఈ పిటిషన్లపై ఈ నెల 6న తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైలుపాలైన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. తనను సీబీఐ అరెస్టు చేయడంపై కోర్టును ఆశ్రయించారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అధికా రులు మార్చి 15 న అరెస్టు చేశారు. ఢిల్లీ కోర్టు కస్టడీ విధించడంతో ఆమెను తీహార్ జైలుకు పంపించారు. జైలులో ఉన్న కవితను ఇదే కేసులో ఈ నెల 11న సీబీఐ కూడా అరెస్టు చేసింది. కోర్టు అనుమతితో అధికా రులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ అరెస్టులపై కోర్టులో కవిత పోరాడుతున్నారు. ఈడీ, సీబీఐ కేసులలో బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
తొలుత మధ్యంతర బెయిల్ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో పూర్తి స్థాయి బెయిల్ కోసం కవిత మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఈడీ, సీబీఐ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, కవితకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ బెయిల్ పిటిషన్ తిరస్కరించాలని కోర్టును అభ్యర్థించారు. అటు కవిత తరఫున వాదనలు కూడా విన్న న్యాయస్థానం ఇవాళ తీర్పు వెలువరిస్తుందని భావించగా మరోసారి వాయిదా వేసింది. దీంతో కవితకు బెయిల్ వస్తుందా రాదా అని బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.


