యువతకు 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి రైతుకు ఏటా 20 వేల రూపాయల ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజధానిగా అమరావతి కొనసాగింపు.. ఇలా పలు హామీలతో ప్రజల ముందుకు వచ్చింది కూటమి మేనిఫెస్టో. అయితే.. ఇక్కడే ఒక ప్రధానమైన అంశాన్ని ప్రస్తావించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ మేనిఫెస్టో టీడీపీ, జనసేనదేనని కామెంట్ చేశారాయన. అదే సమయంలో కమలం మద్దతు తమ హామీపత్రానికి ఉందని తెలిపారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రాన్ని కాపాడుకోవడం, పేదల సంక్షేమమే అజెండాగా సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల ముందుకు వచ్చామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వేళ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ సహా పలువురు నేతల సమక్షంలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రజల ముందుకు వచ్చింది.రేపటి ఆకాంక్షలను సాకారం చేసే విధంగా మేనిఫెస్టో రూపొందించినట్లు వెల్లడించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారని జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. ప్రజారాజధాని అమరావతిని ధ్వంసం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు, విధ్వంస పాలనను సాగనంపేందుకే కూటమి ముందుకొచ్చిందన్నారు పవన్ కల్యాణ్.
పేరుకు ఉమ్మడి మేనిఫెస్టోనే అయినా ఇందులో బీజేపీ ప్రమేయం లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే.. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను అమలు చేసే బాధ్యత టీడీపీ జనసేనదేనని తెలిపారు. జాతీయ పార్టీ అయిన బీజేపీకి స్థానికంగా హామీపత్రాలు ఉండవని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు ఉందని ప్రకటించారు చంద్రబాబు. మరోవైపు.. మేనిఫెస్టోలో ఉన్న కీలక అంశాలను ఓసారి గమనిస్తే.. గతంలో పేర్కొన్నట్లుగానే సూపర్ సిక్స్‌లో భాగంగా.. యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామినిచ్చారు. లేదంటే మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు తెలిపారు. తల్లికి వందనం పేరుతో స్కూలుకు వెళ్లే విద్యార్థులకు ఒక్కొక్కరికి ఏటా 15 వేల రూపాయల సాయం అందించనున్నారు. ప్రతి రైతుకూ ఏటా 20 వేల రూపాయలు పెట్టుబడి సాయంగా ఇవ్వనున్నారు. దీపం పథకం కింద ఏడాదికి ఉచితంగా మూడు సిలెండర్లు ఇస్తామని మేనిఫెస్టోలో హామీనిచ్చారు. అలాగే.. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తామనే హామీని పొందుపరిచారు. ఇక, షణ్ముఖ వ్యూహం అంటూ ఇంటింటికీ రక్షిత తాగునీటిని అందించనున్నారు. కుళాయి కనెక్షన్ ఇవ్వనున్నారు. పేదలను సంపన్నులను చేసే దిశగా.. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్ట్నర్ షిప్ పథకాలు తీసుకురానున్నారు. సౌభాగ్య పథం పేరుతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా పది లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు.
రాజధాని విషయానికి వస్తే.. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. మరోవైపు.. ఉచితంగా ఇసుక ఇవ్వడంతోపాటు భూహక్కు చట్టం రద్దు చేస్తామని తెలిపారు. అలాగే.. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్న హామీలు ఇచ్చారు. వృద్ధాప్య పెన్షన్లను నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు. దివ్యాంగులకు ఆరువేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బీసీలకు యాభై ఏళ్లు రాగానే నెలకు నాలుగు వేలు పెన్షన్ గా ఇస్తామని తెలిపారు. వీటితోపాటు మరిన్ని హామీలిచ్చారు మేనిఫెస్టోలో. మరి.. రానున్న ఎన్నికల్లో ఈ పథకాలు, హామీలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఏ మేరకు ఓట్లు సాధించి పెడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.


