రిజర్వేషన్ల రగడతో దేశ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ అంతకంతకు పెరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ కుల రాజకీయాలకు ప్రధాన పార్టీలు తెర తీయడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. తెలంగాణలో మోదీ సర్కార్ టార్గెట్‌గా కాంగ్రెస్, బీఆర్ఎస్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. దీంతో ఇరు పార్టీలకు కమలనాథులు కౌంటర్ ఇస్తున్నారు. తగ్గేదేలే అంటూ మాటల దాడికి దిగుతున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో రిజర్వేషన్ హీట్ సెగలు కక్కుతోంది.
లోక్‌సభ ఎన్నికల వేళ..దేశంలో రిజర్వేషన్ల రగడ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా రిజర్వేషన్ల చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ను దోషిగా చూపేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ సైతం అదే స్థాయిలో ఎదురుదాడికి దిగుతోంది. కాంగ్రెస్ బీసీల రిజర్వేషన్లను తగ్గించి మైనార్టీలకు కట్టబెట్టాలని చూస్తోందని మోదీ ఆరోపస్తుంటే.. ఆయన మరోసారి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తేస్తారని ఖర్గే అంటున్నారు. ఇలా జాతీయ పార్టీలు రెండు రిజర్వేషన్ల చుట్టూ ఓటింగ్ ప్రయారిటీ సెట్ చేసే ప్రయత్నం చేయడం రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
400 లోక్ సభ స్థానాల్లో గెలిస్తే ఎవరి అవసరం లేకుండా రిజర్వేషన్లను రద్దు చేయవచ్చుననేది బీజేపీ కుట్ర అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2025తో ఆరెస్సెస్‌ను స్థాపించి వందేళ్లవుతుం దని.. ఈలోగా భారత్‌ను రిజర్వేషన్ రహిత హిందూదేశంగా మార్చాలని ఆరెస్సెస్ 1925లోనే చెప్పింద న్నారు. ఇందుకోసమే బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్లు పెరగాలంటే జనాభా లెక్క కావాలని… అందుకు కాంగ్రెస్ సిద్ధమని చెప్పారు. ఇదిలా ఉంటే..బీజేపీ-ఆరెస్సెస్‌లు రిజర్వేషన్లను రద్దు చేస్తాయన్నప్రచారంపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. రిజర్వేషన్లకు ఆరెస్సెస్ వ్యతిరేకం కాదని, తొలి నుంచి రాజ్యాంగం నిర్ధేశించిన అన్ని రిజర్వేషన్లకు సంఘ్‌పరివార్ మద్దతుగా నిలుస్తోందని స్పష్టం చేశారు. 2025 నాటికి రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతోందన్న రేవంత్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగం ప్రకారం అమల్లో ఉన్న రిజర్వేషన్లకు తామెన్నడూ వ్యతిరేకంగా మాట్లాడలే దని మోహన్ భగవత్ పేర్కొన్నారు. అవసరమైనంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాల్సిం దేనని ఆయన తేల్చిచెప్పారు. రాజకీయ స్వార్ధంతో రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఆరెస్సెస్‌పై తప్పుడు విమర్శలు చేస్తున్నా రని, ఇదంతా దుష్ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. ఎన్నికల వేళ వివాదం సృష్టించి లబ్దిపొందాలని చూస్తున్నారని తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాలు లక్ష్యంగా చేసుకున్న బీజేపీ అదే స్థాయిలో ఫలితాలు సాధిస్తే భారత రాజ్యాంగం మొత్తం మార్చేసి రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపిం చారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలను రాహుల్ తప్పుబట్టారు. రిజర్వేషన్లకు వ్యతిరేకమని గతంలో ప్రకటించిన ఆయనే ఇలా మాట మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. మరోవైపు బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతే ముఖ్య మంత్రి కుర్చీ కదులుతుందని భయంతోనే బీజేపీపై ఆయన పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో లేదన్నారు. తమ అజెండాలో లేని అంశాలపై సీఎం రేవంత్ చేస్తోన్న మాటలపై స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కేసీఆర్‌పై కోపంతోనే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారని.. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి పట్టం గట్టాలని ప్రజలు డిసైడ్ అయ్యారని తెలిపారు.
మహారాష్ట్ర కొల్లాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ వ్యతిరేకమన్నారు. కర్నాటకలో ముస్లింలను ఓబీసీల్లో చేర్చారని మండిపడ్డారు. దీంతో ఓబీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్నాటక మోడల్ అమలవుతుందని హెచ్చరించారు ప్రధాని మోదీ..మొత్తానికి రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి దేశ రాజకీయాలు. హిందూత్వ పార్టీగా ముద్రపడ్డ బీజేపీకి.. ఇప్పటికే ముస్లిం, క్రిస్టియన్ల వ్యతిరేకత ఉంది. ఇలాంటి సందర్భంలో రిజర్వేషన్ల రద్దు ప్రచారం మోదీ కొంప ముంచే అవకాశముంది. అందుకే ప్రతిపక్షాలు రిజర్వేషన్ల రద్దు అంశాన్ని ప్రధాన అస్త్రంగా మార్చుకు న్నాయనడానికి సందేహమే లేదు. అందుకే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మాట మార్చరని మండపడు తోంది కాంగ్రెస్. మరి రిజర్వషన్ల అంశం ఎన్నికల ఫలితాలపై ఏమేర ప్రభావం చూపుతుందన్నది ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తోంది.


