చిన్నరాష్ట్రమైనా గోవాలో రాజకీయ చైతన్యం ఎక్కువ. రెండే పార్లమెంటు స్థానాలు ఉన్నా.. అది లోక్ సభ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ల మధ్య హోరా హోరీ తప్పదు. గత ఎన్నికల్లో ఉత్తర గోవాలో బీజేపీ, దక్షిణ గోవాలో కాంగ్రెస్ విజయం సాధించాయి. ఈ సారి రెండు స్థానాల్లోనూ ఈ రెండు పార్టీలే ప్రధానంగా ఢీ కొంటున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులకు ఆమ్ ఆద్మీపార్టీ మద్దతు ఉండడం
కాస్త కలిసివచ్చే అంశం.
ప్రకృతి అందాలతో కనువిందుచేసే గోవాలో రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు మే 7న మూడో విడత లో ఒకే రోజు పోలింగ్ జరుగుతుంది. గోవాలో 2009 లో కాంగ్రెస్, బీజేపీ చెరో సీటు గెలుచుకున్నాయి. 2014 లో మోదీ ప్రభంజనం లో రెండు స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది. 2019లో మళ్లీ కాంగ్రెస్, బీజేపీ చెరో సీటు గెలుచుకున్నాయి. ఈ సారి రెండు సీట్లు గెలుచుకునేందుకు ఒక పక్క బీజేపీ, మరో పక్క కాంగ్రెస్ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి.
ఉత్తర గోవా నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా భావిస్తారు. సిట్టింగ్ ఎంపీ, ప్రస్తుత కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ మళ్లీ వరుసగా ఆరో సారి పోటీ చేస్తున్నారు. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వవచ్చు కదా.. అని స్థానిక బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు గోల పెడుతున్నారు. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇస్తున్నా.. స్థానిక బీజేపీ కేడర్ లో అసంతృప్తి కొంత మైనస్ పాయింటే. నార్త్ గోవా నుంచి కాంగ్రె స్ అభ్యర్థి గా రమాకాంత్ ఖలప్ పోటీ చేస్తున్నారు. ఒకప్పటి కేంద్రమంత్రి . 1999 లో శ్రీపాద్ నాయక్, రమాకాంత్ ఖలప్ పోటీ పడ్డారు. మళ్లీ 25 ఏళ్ల తర్వాత నార్త్ గోవా నియోజకవర్గంలో ఈ ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఇండియా కూటమిలో ఆప్ మద్దతు ఉండడంతో కాంగ్రెస్ గెలుపు ధీమాతో ఉంది. మరో పక్క రెవల్యూష నరీ గోవన్స్ పార్టీ తరుపున మనోజ్ పరభ్ అనే యువకుడు పోటీ పడడంతో పోటీ రసకందా యంలో పడింది.
సౌత్ గోవా సాంప్రదాయంగా కాంగ్రెస్ కు అడ్డా. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీని కాక. కొత్త యువకుడికి అవకాశం ఇచ్చింది. బీజేపీ కూడా పారిశ్రామిక కుటుంబానికి చెందిన పల్లవి డెంపో అనే యువతికి ఛాన్స్ ఇచ్చింది . దీంతో గోవా యువత ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. పల్లవి డెంపో కు పోటీగా కాంగ్రెస్ నుంచి భారత నౌకాదళంలో కెప్టెన్ గా పనిచేసి రిటైర్ అయిన ఫెర్నాండెజ్ గోదాలో దిగారు. ప్రచారంలో ఇద్దరు అభ్యర్థులు పోటా పోటీగా, ఉత్సాహంగా దూసు కెళ్తున్నారు. ప్రధాని మోదీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ , తనకు కలసి వస్తాయని ధీమాతో బీజేపీ అభ్యర్థి ఉన్నారు. ఆమ్ ఆద్మీపార్టీ మద్దతు కూడా కాంగ్రెస్ అభ్యర్థికే ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టో, గ్యారంటీలతో ప్రచారాన్ని దుమ్ములేపుతున్నారు ఫెర్నాండజ్. టూరిజా నికి పెట్టింది పేరైన గోవాలో.. టూరిస్ట్ ల రక్షణ, పర్యావరణ పరిరక్షణ, నిరుద్యోగం, గోవా భూముల పరిరక్షణ వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. స్థానిక బీజేపీ సర్కార్ పట్ల వ్యతిరేకత కూడా ఉంది. దీనిని క్యాష్ చేసుకోవాలని ఇండియా కూటమి పార్టీలు భావిస్తున్నాయి. అదే కాంగ్రెస్ కు కలసి వచ్చే అంశం.


