రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షోభంలో పడనుందా ?

  కాంగ్రెస్ కర్ణాటక ఫార్ములా మేనిఫెస్టోతో ఒక అడుగు ముందుకేసి ఆరు గ్యారెంటీల హామీతో తెలంగాణలో అధికార పీఠం ఎక్కింది. అందలం ఎక్కీఎక్కగానే మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వరాన్ని కానుకగా ఇచ్చింది. ఇది సరే మిగిలిన ఐదు గ్యారెంటీలను అమలు పరుస్తుందా? అమలు చేస్తే ఎంతకాలం కొనసాగించగలుగుతుంది? సంక్షేమపథకాలను ఐదేళ్లపాటు అమలు చేసేందుకు రాష్ట్ర ఆర్ధిక వనరు లను కాంగ్రెస్ సమకూర్చుకోగలదా! అనేది లక్షడాలర్ల ప్రశ్నగా మారింది. ఎన్నికల వ్యూహంగా భాగంగా కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చిందా! రేవంత్ రెడ్డి ప్రభుత్వం రానున్న రోజుల్లో సంక్షోభంలో పడుతుందా ? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మరి లోక్ సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? రానున్న కాలంలో కాంగ్రెస్ పాలనపై అసమ్మతి చెలరేగుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందా
కూలుతుందా? అనేది పెద్ద చర్చగా మారింది.

 కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని మరో జన్మ ఎత్తినా వాటిని అమలు చేయడం సాధ్యం కాదని మల్కాజిగిరి బీజేపీ లోక్ సభ అభ్యర్థి ఈటల రాజేందర్ ఒక సమావేశంలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​ హామీలను చూస్తుంటే గత బీర్ఎస్ పాలనలో ఆర్థిక మంత్రిగా పని చేసిన హరీశ్ రావు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు హరీష్ రావు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఆ స్థాయి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆర్థిక, రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

   కాంగ్రెస్ హామీలు అమలు జరగాలంటే రూ.2 లక్షల కోట్లు కోవాలని, కానీ రాష్ట్రంలో అదనంగా రూ.5 వేల కోట్లు కూడా ఖర్చుపెట్టలేని పరిస్థితి ఉందంటున్నారు బీజేపీ నేతలు . ఆలాంటప్పుడు కాంగ్రెస్ హామీల అమలు ఎలా సాధ్యమో ఆలోచించాలని బీజేపీ నేతలు ప్రజలనే సూటిగా అడుగుతున్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, రాష్ట్ర అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోడీ అభివృద్ధిపేరుతో ఓట్లు అడుగుతుంటే, కేవలం శ్రీరాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు…బీజేపీ నేతలు… కేంద్రంలో మోడీ ప్రభుత్వం నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించిందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కల్పన గురించి గొప్పగా చెప్పిన కేసీఆర్ డబుల్ బెడ్ రేమ్ ఇళ్లను మాత్రం ఎక్కడా కట్టలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లభించింది. కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలుపొందగా.. బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, ఒక స్థానంలో సీపీఐ గెలుపొందాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 60 సీట్లు కావాల్సి ఉండగా.. కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలుపొందింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నాలుగు నెలలు కావస్తోంది.దీంతో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చినట్టయ్యింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోనే సరిపోలేదని, ముందుంది మొసళ్ల పండగ అని రాజకీయ వర్గాలు ఇప్పటికే బహిరంగంగా చర్చించుకుంటున్నాయి.

  కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలంటే, దాదాపు ఆరునెలల గడువు పడుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలే చెప్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీని ఆగస్టు 15 కల్లా అమలు చేస్తానని సవాల్ విసిరి రాజీనామాల వరకు రాజకీయాన్ని లాక్కెళ్లారు. ఇదిలా ఉంచితే హస్తం పార్టీ సమయం తీసుకున్నా కూడా ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయగలుగుతుందా!.అంటే ఇంపాజబుల్ అనే మాటే ఎక్కువగా వినిపిస్తుంది. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వ ఖజానా చూస్తే… అంత ఆశాజనకంగా లేదన్న విషయం ఇప్పటికే తేటతెల్లమైంది. ఇచ్చినవి ఆరు హామీలే అయినా… వాటిని అమలు చేసేందుకు ఆర్థిక వనరులు ఏ మాత్రం ఆశించే స్థాయిలో లేవని ఆర్ధిక నిపుణులే స్పష్టంగా చెప్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పటికే అప్పుల ఊబిలోకి దింపింది. మరి కాంగ్రెపస్ ఇచ్చిన హామీలు అమలు చేయడానికి, వేల లక్షల కోట్లు ఖర్చవుతాయన్నది వాస్తవం…మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా అప్పులు చేసి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందా? చేస్తే ఎంతకాలం చేస్తుంది.? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ క్రమంలో హామీలకు తాము గ్యారంటీ అని చెప్పి, మళ్లీ లోక్ సభ ఎన్నికల్లో గెలుపుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగానే కృషి చేస్తుంది.

   రాష్ట్రంలో నిరుద్యోగుల విషయానికి వస్తే, జాబ్ కేలండర్ లో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీన్ని పరిశీలిస్తే అసలు రాష్ట్రంలో అన్ని ఖాళీలు ఉన్నాయా? ఉంటే ఏయే విభాగా ల్లో ఉన్నాయనేది ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయకపోతే, నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెప్తేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతులకు, కౌలు రైతులకు రైతు భరోసా, 200 యూనిట్ల వరకూ విద్యుత్తు ఛార్జీల మినహా యింపు, రైతు రుణ మాఫీ వంటి భారీ హామీలు హస్తం పార్టీ ముందున్న పెద్ద సవాళ్లు. ఈ హామీలన్నీ కూడా ఖజానాపై భారీ ఎత్తున భారం మోపేవే. వీటిలో ఏ ఒక్క హామీ నెరవేర్చడంలోనైనా కాంగ్రెస్ వెనకడుగు వేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఖాయమనే మాట సర్వత్రా వినిపిస్తోంది.

    ఇదిలా ఉంటే కర్ణాటకలో 2 వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇవ్వడానికి.. మిగిలిన వాళ్లపై విద్యుత్తు చార్జీల భారాన్ని మోపింది. ఇదే పరిస్థితి తెలంగాణ ప్రజలకు ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుందో..ఊహించుకోవడం ఏమంత కష్టం కాదు. అదేవిధంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింనదుకు బస్సు ఛార్జీలను కూడా పెంచే అవకాశాలున్నట్లు టాక్ వినిపిస్తోంది.ఇవన్నీ లోక్ సభ ఎన్నికల అనంతరం జరిగే ప్రక్రియలని ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇదేకనుక జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి తిప్పలు తప్పవని పొలిటిక్ సర్కిల్ లో చర్చలు కూడా బాగానే జరుగుతున్నాయి. ఆరుగ్యారెంటీలతోపాటు ఆర్థిక భారం పడే చాలా హామీలు కాంగ్రెస్‌కు తొలి ఆరు నెలల్లోనే పెద్ద సవాళ్లుగా మారనున్నాయి. వీటన్నిటినీ అమలు చేయడానికి నిధులు ఎక్కడ నుండి తెస్తారు? ఇతర ఆదాయ మార్గాలను అన్వేషిస్తారా? లేక అప్పులు మీద ఆధారపడతారా? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనికి తోడు కాంగ్రెస్‌ ను ఆమడ దూరంలో ఉంచే బీజేపీ, కేంద్రంలో అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం నిధుల మంజూరు చెయ్యడంలో కాంగ్రెస్ కు చుక్కలు చూపిస్తుందనేది జగమెరిన సత్యమే..రాష్ట్రంలో నిధుల కొరతతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అలవికానీ, అమలు చేయలేని హామీలపై ఆర్థికశాస్త్రవేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉచితాలతో అభివృద్ధి ఎలా సాధ్యమని ఒకవైపు మేధావులు ప్రశ్నిస్తున్నారు. మరి ఇన్ని గండాలను దాటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా గట్టెక్కు తుందో వేచి చూడాల్సిందే.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్