అంబేద్కర్‌ కోనసీమలో పెచ్చరిల్లిన క్యాస్ట్ పాలిటిక్స్‌

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వేళ మరోసారి కులాల ప్రాతిపదికన రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ప్రత్యేకించి అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఇలాంటి పాలిటిక్స్‌కు పెట్టింది పేరన్న అభిప్రాయం బలంగా విన్పిస్తోంది. దీంతో.. నేతలంతా ఆయా సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేస్తూ రాజకీయాన్ని నడుపుతున్నారన్న కామెంట్లు విన్పిస్తున్నాయి. ఓవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో కుల సంఘాల మీటింగ్‌లు పెట్టి మరీ ఆయా సామాజిక వర్గాల వాళ్ల ఓట్లు దక్కించుకు నేందుకు ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది.

   చుట్టూ పచ్చటి పంట పొలాలు.. ఆ పక్కనే అందమైన గోదావరి.. చూడడానికి ఎంతో ఆహ్లాదంగా కన్పిస్తుంది ఈ ప్రాంతం. అయితే.. పైకి ఎంత అందంగా కన్పిస్తుందో.. ఇక్కడి రాజకీయాలు అంత హాట్‌ హాట్‌గా సాగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అంబేడ్కర్ కోనసీమ జిల్లా కుల రాజకీయాలకు పెట్టింది పేరన్న వాదన ఎప్పటి నుంచో విన్పి స్తోంది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలతోపాటు ఒక ఎంపీ స్థానంలోనూ ఆయా సామాజిక వర్గాలదే ఆధిపత్యం. అసలు.. కొన్ని సామాజిక వర్గాలే ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయని చెప్పాలి.

జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడు నియోజకవర్గాలు ఎస్సీ అసెంబ్లీ స్థానాలుగా మారాయి. అవే అమలాపురం, రాజోలు, పి.గన్నవరం. ఇక, కొత్తపేట, మండపేట, రామచంద్రాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాలు జనరల్‌ స్ధానాలు. అదే సమయంలో ఎంపీ స్ధానం రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమే. దీంతో.. క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎక్కువగా సాగుతాయి ఇక్కడ. జిల్లా కేంద్రమైన అమలాపురం నియోజకవర్గం ఎస్సీ సెగ్మెంట్‌ కావడంతో ఇక్కడ అగ్ర కులాలు ఎటు వైపు ఉంటారన్నదే ప్రధాన అంశంగా మారింది. దశాబ్దాలుగా కాపులు, శెట్టిబలిజలకు మధ్య రాజకీయంగా వార్‌ నడుస్తోంది. గతంలో తెలుగుదేశం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన మెట్ల సత్యనారాయణ, కాంగ్రెస్‌ నుంచి శెట్టిబలిజ వర్గానికి చెందిన కుడుపూడి ప్రభాకరరావు పోటీ చేశారు. వీరిద్దరి మధ్య రాజకీయ వైరం అంటే కులాల వైరంగానే గతంలో పరిగణించే వారు. అలాంటి పరిస్థితుల మధ్య అమలాపురం ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారడంతో… కాపులు టీడీపీ అభ్యర్ధికి, శెట్టిబలిజలు కాంగ్రెస్‌కు మద్దతు పలికారు.

రాష్ట్ర విభజన, వైసీపీ ఆవిర్భావం తర్వాత శెట్టి బలిజలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వైపు మళ్లారు. నటుడు చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టిన తర్వాత కాపులు ఆ పార్టీకి మద్దతు పలికారు. ప్రస్తుత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం జనసేనకు మద్దతుగా మారింది. అయితే, టీడీపీలోని పాత కాపులు ఇంకా ఆ పార్టీలోనే ఉన్నారు. దీంతో ఇక్కడ కాపు సామాజిక వర్గం రెండు వర్గాలుగా విడిపోయి ఉంది. ఇలాంటి వేళ జనసేన, టీడీపీ పొత్తుతో కాపులు అంతా ఏకం అవుతారని, ఓట్లన్నీ గంపగుత్తగా కూటమికే పడతాయన్న ఆశ టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో నెలకొంది. ప్రస్తుత ఎన్నికల విషయానికి వస్తే.. అమలాపురం సెగ్మెంట్‌లో కులాలను మచ్చిక చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ముందుగా కాపు సంఘాలతో టీడీపీ పెద్దలు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశానికి ఆశించిన స్థాయిలో కాపు నాయకులు రాలేదనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైసీపీ అభ్యర్ధి పినిపే విశ్వరూప్‌ కూడా కాపు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాత్రం కాపుల నుంచి భారీస్ధాయిలో మద్దతు వచ్చినట్లు చెబుతున్నారు స్థానికులు. దీంతో.. వైసీపీ ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం.

అమలాపురం సెగ్మెంట్‌లో ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వంటి అగ్ర కులాల వారితో కూడా టీడీపీ నాయకులు సమా వేశాలు ఏర్పాటు చేశారు. క్షత్రియులు సైతం ఈ సెగ్మెంట్‌లో చెప్పుకోతగిన స్ధాయిలోనే ఉన్నారు. వీరితో సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ…ఈ సమావేశం ముగిసిన తర్వాత క్షత్రియుల ఓట్లపై ఎక్కువగానే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇక, బ్రాహ్మణులది అమలాపురం నియోజకవర్గంలో మైనార్టీ సంఖ్యేనని చెప్పాలి. ఒక విధంగా వారంతా టీడీపీ మద్దతుదారులే. అయితే, ఈ ఎన్నికల్లో వారి మద్దతు ఎవరికి ఉంటుందనేది గుంభనంగానే ఉంది. వైశ్యుల తోనూ సమావేశం నిర్వహించింది టీడీపీ. అయితే.. వారి సపోర్ట్ కచ్చితంగా టీడీపీకేనన్న వాదన బలంగా విన్పిస్తోంది. స్పాట్…

వాయిస్ – అధికార వైసీపీ శెట్టి బలిజలతో సమావేశం నిర్వహించింది. దీంతో.. బీసీల మద్దతు వైసీపీకే ఉంటుందని ఆ పార్టీ నేతలు బల్ల గుద్దిమరీ చెబుతున్నారు. ఇక టీడీపీ కాని, వైసీపీ కాని ప్రత్యేకించి ఎస్సీలతో మాత్రం సమావేశం నిర్వహించలేదు. అయితే.. వారి మద్దతు తమకే ఉంటుందనే ధీమాతో ఉన్నారు రెండు పార్టీల నాయకులు. గ్రామాల్లో ప్రచారానికి వెళ్లిన సందర్భంలో మాత్రం అక్కడున్న ఎస్సీ సామాజిక వర్గం పెద్దలతో సమావేశాలు పెడుతున్నారు. వారిని తమవైపు తిప్పుకునేందుకు ఇటు వైసీపీ, అటు టీడీపీ నేతలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు.. ఇలాంటి కుల సంఘాల మీటింగ్‌లలో నియోజకవర్గంలోని మండపేట ముందు ఉంది. ఇక్కడి టీడీపీ అభ్యర్ధి వేగుళ్ల జోగేశ్వర రావు కాపులతోను, శెట్లి బలిజలతోను సమావేశాలు ఏర్పాటు చేశారు. మాదిగ, రెల్లి వంటి ఉపకులాలకు చెందిన వారితోనూ ఆయన సమావేశాలు నిర్వహించారు. అగ్ర కులాలైన బ్రాహ్మణ, వైశ్య, కమ్మ కులస్ధులతోనూ వేగుళ్ల జోగేశ్వర రావు సమావేశాలు నిర్వహించారు. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తోట త్రిమూర్తులు కూడా కాపులతో సమావేశం నిర్వహించడమే కాక వారితో కలిసి భారీ స్ధాయిలో ర్యాలీ నిర్వహించి నామినేషన్‌ వేశారు. ఇక్కడ బీసీల తో, ఎస్సీలతో తోట త్రిమూర్తులు సమావేశం నిర్వహించారు. వారి ఓట్లను గంపగుత్తగా సాధించే ప్రయత్నం చేస్తున్నారు.

రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ అభ్యర్ధిలిద్దరు శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం తో ఇతర కులాల వారిని ఆకట్టుకునేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే, టీడీపీ అభ్యర్ధి వాసంశెట్టి సుభాష్‌ స్ధానికేతరుడు కావడంతో ఇతరల నుంచి ఆయనకు ఆశించిన మేర మద్దతు రావడం లేదని అంటున్నారు. ఇక వైసీపీ అభ్యర్ధి పిల్లి సూర్య ప్రకాష్‌ స్ధానికుడు కావడమే కాకుండా ఆయన తండ్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు అన్ని సామాజికవ ర్గాల్లోనూ అభిమానులున్నారు. దీంతో ఇక్కడి పోరు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

కొత్తపేట సెగ్మెంట్‌లో కాపులు ఎక్కువ. ఇక్కడ వైసీపీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చిర్ల జగ్గిరెడ్డి బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి బండారు సత్యానందరావు పోటీ చేస్తున్నారు. టీడీపీ ఇప్పటికే కాపులతో సమావేశం నిర్వహించింది కానీ, జగ్గిరెడ్డి మాత్రం వారితో ఎలాంటి సమావేశాలు జరపకుండా లోపాయి కారిగా చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. ఇక్కడ రెడ్డి సామాజికవర్గం సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. పైగా కొత్తపేటలో ఎప్పటి నుంచో చిర్ల, బండారు కుటుంబాల మధ్యే రాజకీయ పోరు సాగుతుండడంతో, విజయం కోసం ఇరువురూ శక్తివంచన లేకుండా పోరాడుతున్నారు.

ముమ్మిడివరం నియోజకవర్గానికి వస్తే అక్కడ మత్య్సకారులు ఎక్కువ. వైసీపీ అభ్యర్ధి పొన్నాడ సతీష్‌ కుమార్‌ మత్య్సకార సామాజికి వర్గానికి చెందిన వ్యక్తే కావడం ఆయనకి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఇక, ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న దాట్ల బుచ్చిరాజు ఇప్పటికే మత్య్సకార సామాజిక వర్గం నాయకులతో చర్చలు జరిపారు. మిగిలిన కుల సంఘాలతో, నాయకులతో సమావేశమ వుతూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నాయి స్థానికంగా ఉన్న రెండు పార్టీల శ్రేణులు. రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలు రిజర్వ్‌డ్‌ నియోజక వర్గాలు. ఇక్కడ క్షత్రియ, బ్రాహ్మణ, కాపు, వైశ్యుల ఓట్లు ఎక్కువ. అలాగే పి.గన్నవరంలో మైనారిటీల సంఖ్య సైతం ఎక్కువే. దీంతో..ఈ ఓట్లను కొల్లగొట్టేందుకు వైసీపీ, టీడీపీ అభ్యర్ధులు ఆయా సామాజికవర్గాల వారితో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు.మొత్తంగా చూస్తే.. ఎన్నికల వేళ కొందరు పైకి కన్పించేలా, మరికొందరు అంతర్గతంగా కులసంఘాలతో సమావేశమవుతూ వీలైనంత ఎక్కువగా వారి ఓట్లతో లాభపడేందుకు ప్రయత్నిస్తున్నా రన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్