మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే చాలా కాలం తర్వాత.. తమ్ముడు పవన్‌కల్యాణ్ కోసం రాజకీయ తెరపైకి వచ్చారు మెగస్టార్. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఓ వీడియో కూడా చేశారు. ఇప్పుడీ వ్యవహారమే ప్రస్తుత రాజకీయాల్లో దుమారం రేపుతోంది. కాంగ్రెస్‌లో ఉన్న చిరు.. ఎన్డీఏ కూటమికి ఎలా మద్దతిస్తారంటూ నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన చిరంజీవి కీలక ప్రకటన చేసారు. ఏపీలో కూటమి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్దులకు మద్దతు ఇవ్వాలని అభ్యర్దించారు. తాజాగా చిరంజీవి తన సోదరుడు పవన్ కు జనసేన కోసం అయిదు కోట్ల విరాళం ఇచ్చారు. కూటమి నుంచి పోటీ చేస్తున్న పలువురు అభ్యర్దులు చిరంజీవిని కలిసి మద్దతు కోరుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి రాజకీయంగా ఆసక్తికర ప్రకటన చేసారు. గతంలో చిరంజీవితో ప్రజారాజ్యంలో కలిసి పని చేసిన నేతలు…మెగాస్టార్ తో సాన్నిహిత్యం ఉన్న నాయకులు ఆయనకు కలిసి మద్దతు కోరారు. తాజాగా బీజేపీ నుంచి అనకాపల్లి ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్..పెందుర్తి నుంచి జనసేన అభ్యర్దిగా పోటీలో ఉన్న పంచకర్ల రమేష్ బాబు ఇద్దరూ చిరంజీవిని కలిసారు. ఈ సందర్భంగా వారితో కలిసి చిరంజీవి ఒక వీడియో విడుదల చేసారు. అందులో తాను చాలా కాలం తరువాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. సీఎం రమేష్ తో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. పంచకర్ల రమేష్ ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన అంశాన్ని ప్రస్తావించారు.
తమ్ముడు పవన్, చంద్రబాబు, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సమయంలో సీఎం రమేష్ ను గెలిపించు కోవటం ద్వారా ఢిల్లీ ద్వారా మంచి చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేసారు. సీఎం రమేష్, పంచకర్ల రమేష్ ను గెలిపించాలని కోరారు. వారికి తన మద్దతు ప్రకటించారు. కొద్ది కాలం క్రితం తమ్ముడు పవన్ రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉండాలని తాను కోరుకున్నానంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే, చిరంజీవి రాజకీయంగా ఎక్కడా ప్రత్యక్షంగా ప్రమేయం లేకుండా జాగ్రత్త పడ్డారు. తాజాగా చిరంజీవిని సోదరులు నాగబాబు, పవన్ కలిసారు. వారికి రూ 5 కోట్ల విరాళం చిరంజీవి అందించారు. దీని ద్వారా జనసేనకు పరోక్షంగా మద్దతు ప్రకటించారు. ఇప్పుడు బీజేపీ, జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్దులకు చిరంజీవి నేరుగా మద్దతు ప్రకటించటంపైన సోషల్ మీడియాలో భిన్నాభిప్రా యాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ కు చిరంజీవి రాజీనామా చేయకుండా ఎన్డీఏ కూటమి అభ్యర్దు లకు మద్దతుగా నిలవటం ఏంటని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే, చిరంజీవి ఈ ఇద్దరు అభ్యర్దుల గురించి ప్రత్యేకంగా వీడియోలో ప్రస్తావించారు. అయితే, చిరంజీవి మద్దతు కూటమికి ఉందనే చర్చ వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో చిరంజీవి చేసిన ఈ ప్రకటన ద్వారా ఇప్పుడు రాజకీయంగానూ చిరంజీవిని ప్రత్యర్ది పార్టీలు లక్ష్యంగా చేసుకొనే అవకాశం ఉంది. దీంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయన్నది ఆసక్తిగా మారింది.


