పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మె్ల్యేలు, కీలక నేతలు పార్టీని వీడగా.. తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్ చెప్పారు. తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో వెంకట్రావు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఎమ్మెల్యే వెంకట్రావుతో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుండే ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారని.. ఆయన త్వరలోనే అధికార పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలకు బలం చేకూరేలా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, కాంగ్రెస్ నేతలతో భేటీ కావడంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని వార్తలు వినిపించాయి. తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభకు సైతం ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఇవాళ ఎట్టకేల కు ఈ వార్తలను నిజం చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుండి బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యపై విజయం సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక సీటు భద్రాచలం మాత్రమే. తాజాగా వెంకట్రావు కూడా ప్లేటు ఫిరాయించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా అయ్యింది. ఇప్పటికే పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరిన బీఆర్ఎస్.. తెల్లం వెంకట్రావు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న కాంగ్రెస్‌పై ఎక్స్ వేదికగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకవైపు తన మేనిఫెస్టోలో ఇతర పార్టీల నుంచి చేర్చుకోమని చెప్తూనే.. తెలంగాణలో కారు గుర్తుపై గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్ ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ ద్వంద్వ నీతి కాదా అని ప్రశ్నించారు. గెలిచేంత వరకు ఒక మాట.. గెలిచాక ఇంకో మాట చెప్పడం కాంగ్రెస్‌కు అలవాటేనని ఎద్దేవా చేశారు. ఇదే కాంగ్రెస్ నీతి రీతి అని..ఈ విషయంలో బీజేపీకి, కాంగ్రెస్‌కి తేడా లేదని కేటీఆర్ ట్వీట్ చేశారు.


