ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఓవైపు అధికారులు డొంకను కదిలించే పనిలో ఉంటే.. మరోవైపు పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎవరికి ఎవరూ తక్కువకాదన్నట్టు కౌంటర్ ఎటాక్ చేస్తూ విచురుకుపడుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ టార్గెట్ గా హస్తం, కమలనాథులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది.
తెలంగాణ రాజకీయమంతా ఫోన్ ట్యాపింగ్ చుట్టూ తిరుగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మరింత మంటలను పుట్టిస్తోంది. బీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తుంటే.. వీరికి కౌంటర్ ఎటాక్ ఇస్తూ అంతే ఘాటుగా స్పందిస్తున్నారు గులాబీ నాయకులు. ట్యాపింగ్‌పై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరుల వ్యక్తిగత స్వేచ్చను హరించే హక్కు ఎవరిచ్చా రంటూ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. కేవలం రాజకీయ అవసరాల కోసం అధికారులను, డిపార్ట్మెంట్లను వాడుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మాకేం సంబంధం లేదని ఎలా చెబుతారంటూ కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఇక మాజీ మంత్రి కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై స్పందించారు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యన్నెం శ్రీనివాస్ రెడ్డి. నా ఫోన్ ట్యాపింగ్ అయింది కాబట్టే.. దీని వెనుక ఉన్నదెవరో తేల్చమంటూ అత్యున్నత పోలీస్ అధికారి డీజీపీకి ఫిర్యాదు చేశాను. అది కూడా తప్పేనా కేటీఆర్ అంటూ సూటిగా ప్రశ్నించారు. అలాగే సిరిసిల్లలో వార్ రూంపై ఎంక్వైరీ చేయామంటూ కేకే మహేందర్‌రెడ్డి కోరారు. దీనికే రెచ్చిపోయి లీగల్ నోటీసులు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు లా, అడ్మినిస్ట్రేషన్‌పై పరిజ్ఞానం లేదు కాబట్టే పదేళ్ల పాలన ఇలా సాగిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కేసీఆర్ అనుమతి లేనిదే ట్యాపింగ్ అసాధ్యమంటూ బీఆర్ఎస్ అధినేతపై ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. విచారణలో భయంకరమైన అంశాలు బయటకు వస్తున్నాయని.. ప్రజాస్వా మ్యాన్ని హతమార్చే విధంగా కేసీఆర్ కుటుంబం బరితెగించారని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఇది ఆషామాషీ కేసు కాదని.. ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కోరారు. ట్యాపింగ్‌తో సంబంధంలేదని కేటీఆర్ ఎలా చెప్తారంటూ మండిపడ్డారు. ఎన్నికల నిబంధనలను అత్రిక్రమించి, రాజకీయ లబ్ది కోసం ట్యాపింగ్ చేశారన్నారని చెప్పుకొచ్చారు. ట్యాపింగ్ అంశాన్ని సుమోటోగా తీసుకుని ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ గుర్తుపై పునరాలోచన చేయాలని.. వారికి అర్హతే లేదని ధ్వజమెత్తారు.
మరోవైపు కేసు విచారణ ట్విస్టుల మీద ట్విస్టులతో కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హైలైట్ అవుతోంది. ట్యాపింగ్ కేసులో నిందితుడు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు గతంలో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఫైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. వారి ఫోన్లు ట్యాపింగ్ చేయటం ద్వారానే.. గత ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. మెయినాబాద్‌లోని ఫైలట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన చర్చలు జరగ్గా.. అప్పటి ఎస్ఐబీ ఓఎస్డీ రాధాకిషన్ రావు బృందం సీసీ కెమెరాలు, మైకులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో బీఎల్ సంతోష్, తుషార్ కోసం ఢిల్లీ, కేరళకు ప్రత్యేక బృందం స్పెషల్ ఫ్లైట్‌ను వినియోగించింది. అయితే,.. ఈ ఫ్లైట్ బీఆర్ఎస్ నేతకు చెందినదిగా గుర్తించారు అధికారులు. ప్రస్తుతం ఫ్లైట్ యజమానిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. అందులో ఎవరెవరు వెళ్లారన్న దానిపై కూపీ లాగుతున్నారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ రగడకు దారి తీసింది. గత పదేళ్ల పాలనలో అధికారమంతా గుప్పిట్లో పెట్టుకుని ఆఫీసర్లతో ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని కాంగ్రెస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు అసలు సూత్రధారులను పట్టుకునే పనిలో బిజీ అయిన ఈడీ అధికారులు ఎంక్వైరీలో నిందితుల నుంచి నిజాలను కక్కిస్తున్నారు. ఇంతకీ ట్యాపింగ్ ఎవరి కనుసన్నల్లో నడిచింది..? ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న డొంక కదలాలంటే పూర్తి దర్యాప్తు వరకూ వేచి చూడాల్సిందే.


