నయ వంచన, చీటింగ్, డిసీవింగ్ ఈ పదాలన్నీ ఎవరికి వర్తిస్తాయంటే ఏం చెబుతాం కేటుగాళ్లకు, మోసగాళ్లకు వర్తిస్తాయని అంటాం. అయితే, గత ప్రభుత్వంలో విజిలెన్స్ శాఖ ఉన్నతాధికారి ఈ రీతిన గుండెలు తీసిన బంటులా ప్రవర్తించాడు. దీంతో, అందరికీ గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెన్షన్ అనంతరం సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రణీత్ రావు పాల్పడ్డ అక్రమ వ్యవహారాలపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు.
ప్రణీత్ రావ్ సస్పెన్షన్ లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఎస్ఐబీ కార్యాలయం లాగర్ రూమ్ లోని లాప్ టాప్, హార్డ్ డిస్క్, కీలక నేతకు చెందిన ఫోన్ ట్యాపింగ్ డేటా, కాల్ డేటా రికార్డ్, ఐఎమ్ఈఐ నంబర్లతో సహా సర్వ రహస్య సమాచారాన్ని ది గ్రేట్ ప్రణీత్ రావు ధ్వంసం చేయించినట్టు తెలిసింది. ఎలక్ట్రీషియన్ సాయంతో ఆయన సీసీ కెమెరాలు ఆఫ్ చేయించి 42 హార్డ్ డిస్క్ లను రిమూవ్ చేసినట్టు, డేటా బేస్ లోని మొత్తం డేటాను తొలగించినట్టు తెలిసింది. ప్రణీత్ నిర్వాకాన్ని చూసి ప్రజల ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు రాజకీయ నాయకుల కబంధహస్తాల్లోకి చేరితే పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఎస్ఐబీ ఇంటిలిజెన్స్ విభాగం విధి ఏమిటి చట్ట విరుద్ధమైన పనులు చేసే వారిపై నిఘా పెట్టడం, అయితే, కంచే చేను మేసినట్టు ఈ వింగ్ ఉన్నతాధికారే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ఫోన్స్ ట్యాంపరింగ్ లు, హార్డ్ డిస్క్ లు తొలగింపులు, కీలక నేత కాల్ డేటా రికార్డుల ధ్వంసాలు..తదితర ఎన్నో అనుచిత పనులకు పాల్పడినట్టు వెల్లడైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెన్షన్ కి గురైన మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావు అంశం కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రస్తుతం సిరిసిల్లలో డిసిఆర్బి డిఎస్పీగా ఉన్న ప్రణీత్ రావ్.. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హెడ్ క్వాటర్ విడిచి వెళ్ళరాదని ఆదేశాలు జారీ చేశారు.ప్రణీత్ రావు చేసిన కుట్ర పై ప్రభుత్వానికి నివేదిక అందించారు అధికారులు.
గత ప్రభుత్వంతో సన్నిహితంగా మాజీ ఐపిఎస్ ప్రభాకర్ రావు కు ప్రణీత్ రావు బంధువు కావడం సిఐ నుంచి ప్రమోషన్ రావడం తో ప్రణీత్ రావు తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు ఉన్నతాధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయనుంది. ఈ కేసు లో సిట్ ద్వారా మినిట్ టూ మినిట్ ఏం జరిగిందో తెలుసుకునే విధంగా సిట్ దర్యాప్తు చేయనుంది. SIB లో DSPఅధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యక్తిగత గొప్యతలో భాగమైన పర్సనల్ డేటాను సైతం అమాత్యులకు చేరవేసినట్టు అధికారులు గుర్తించారు. ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావ్ కోవర్ట్ వ్యవహారంపై ప్రభుత్వానికి ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చారు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు రాత్రి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 45 హార్డ్ డిస్క్ లతో పాటు కీలక ఫైల్స్ ను మాయం చేసినట్లు నివేదికలో పందుపరిచారు.
ప్రణీత్ రావు పై పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. ప్రభుత్వ రహస్య సమాచార సేకరణ, వ్యక్తిగత వివరాలు చోరీ, హార్డ్ డిస్క్ లు ధ్వంసం, అధికార దుర్వినియోగం, ప్రభుత్వాస్తులు ధ్వంసం కేసుల్లో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ తో పాటు IT యాక్ట్ కింద కేసులు నమోదు చేసేందుకు ఉన్నతాధికారులు రెడీ అయినట్టు సమాచారం. ప్రణీత్ రావ్ వ్యవహారం లో మాజీ పోలీసు ఉన్నతాధికారి ప్రమేయం ఉన్నట్టు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రణీత్ రావ్ ప్రమోషన్ వ్యవహారంపైనా అధికారులు లోతైన విచారణ చేపట్టినట్టు తెలిసింది. సిఐడి లేదా సిట్ కు కేసును అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. 2007 బ్యాచ్ కు చెందిన ప్రణీత్ రావు, నల్గొండ జిల్లాలో ఎస్సైగా వివిధ పోలీస్ స్టేషన్ ల్లో పనిచేశారు. 2014లో BRS ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత SIB లోకి వచ్చిన ప్రణీత్ రావు..మాజీ IPS ప్రభాకర్ రావుకు దగ్గర బంధువు. ఈ కేసులకు తోడు, గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ప్రణీత్ రావుకు యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ఫోన్ టాపింగ్ అనేది దేశ ప్రయోజనాలకు, దేశ భద్రతకు సంబంధించి సమస్యలు ఎదురైన ప్పుడు, చట్టానికి లోబడి ప్రత్యేక పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటారు. అయితే, గత ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ తో పాటు ప్రతి ఒక్క డిపార్ట్ మెంట్ పై సైతా నిఘా వేసింది. ఫోన్ ట్యాపింగ్ తో గత ప్రభుత్వం ఎన్నో ఆరాచాకాలకు తెర లేపినట్టు తెలుస్తోంది.
ప్రణీత్ రావు , గత ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ ను చేరవేశారని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి సైతం గతంలో ప్రణీత్ రావ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు దుగ్యాల ప్రణీత్‌రావు వ్యవహారిస్తు న్నారని ఈయన నేతృత్వంలో దాదాపు 30 మంది పోలీసులు పనిచేస్తున్నారని నాడు రేవంత్ రెడ్డి అప్పట్లో ఆరోపిం చారు. కొందరు ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులు, రాజకీయ నేతలు, పాలకుల చెప్పుచేతల్లో ఉండడంతో ఈ తరహా విపత్కర పరిస్థితులు ఏర్పడడం, ప్రభు త్వాలు మారినప్పుడు ఈ విషయాలు వెలుగుచూడడం జరుగుతోంది. ఏదేమైనా స్వార్థరహిత పాలకులు, నిబద్ధత, నిజాయితీ, నిర్భయంగా వ్యవహరించే అధికారులు ఉన్నప్పుడే ప్రజాను రంజక పాలన సాగినట్టు భావించాల్సి ఉంటుంది. పాలకగణాలకు అధికారులు డూడూ బసవన్నల మాదిరి వ్యవహరిం చకుండా ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది.


