ఎన్నికలవేళ ఏపీ సీఎం జగన్ స్పీడ్ పెంచారు. ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ కార్యక్రమాల అమలులో జోరు చూపిస్తున్నారు. రేపటి నుంచి వరుసగా సీఎం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పైన వివిధ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ నెల పదో తేదీన జరిగే సిద్దం సభలో సీఎం జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్నారు.
ఏపీ సీఎం జగన్ మంగళవారం నుంచి వరుసగా జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా వివిధ రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో జగన్ స్పీడ్ పెంచారు. అందులో భాగంగా మంగళవారం ఆయన విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ రాడిసన్ బ్లూ రిసార్ట్స్ లో జరిగే విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ సమావేశం అవుతారు. అలాగే 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం జగన్ ప్రారంభోత్సవాలు చేస్తారు.
గతంలో విశాఖ వేదికగా ఏపీ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ ను నిర్వహించింది. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలిరావడంతో పాటు యువతకు భారీగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించాయి. తాజాగా విశాఖలో వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ సమావేశం అవుతుండడంతో రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక అదే రోజు స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశం అవుతారు. ఈ సమావేశంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు కల్పనకు తీసుకున్న చర్యలపై సీఎం జగన్ వివరించే అవకాశం ఉంది.
మరోవైపు తీవ్ర వర్షాభావం కారణంగా 2023 ఖరీఫ్ సీజన్‌లో ఏర్పడిన కరువుతో పాటు 2023–24 రబీ సీజన్ ఆరం భంలో మిచాంగ్ తుఫాన్‌తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 6న రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11.59 లక్షల మంది ఖాతాల్లోకి 1, 294 కోట్లు జమ చేయ నున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 6న ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తారు. వెలిగొండ టన్నెల్‌ను ప్రారంభిస్తారు. అలాగే ఈ నెల 7న జగన్ అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తారు. అనకాపల్లిలో జరిగే బహిరంగ సభలో వైయస్సార్ చేయూత నిధులను అర్హులైన వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఇక 8న సీఎం పులివెం దులలో పర్యటిస్తారు. అక్కడ జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇదిలా ఉంటే ఈ నెల 10న బాపట్ల జిల్లా మేదరమెట్లలో సిద్ధం సభను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలతో పాటు రాయల సీమలను కలుపుతూ మూడు సిద్ధం సభలను నిర్వహించింది. ఈ సభలకు అనూహ్య స్పందన వచ్చింది. మేదరమెట్ల సభలో సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఈ సభలో సీఎం జగన్ వివరించనున్నట్లు తెలుస్తోంది.


