తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన రెండో పార్టీగా చరిత్రలో నిలిచిపోయింది హస్తం పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది పూర్తి అయింది. ఇంతకీ ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చిందా…? ఇకపై కాంగ్రెస్ కార్యాచరణ ఎలా ఉండనుంది…? మొదటి సంవత్సరం అనుభవాలు ఎలా ఉన్నాయి? హస్తం నేతల ఫీలింగ్ ఏంటి…?
తెలంగాణ ప్రజలు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన 63 మంది అభ్యర్థులు గెలిచారు. డిసెంబర్ 3న ఫలితాలు రాగా… అదే రోజు సాయంత్రం ఎల్లా హోటల్‌లో క్యాంపు నిర్వహించారు. సీఎల్పీ నాయకుడిగా అధిష్ఠానం ఎవరిని నియమించినా సమ్మతమే అని 63 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సీఎల్పీ నాయకుడి ఎంపికపై రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేసేందుకు…. అధిష్ఠానం పెద్దలతో భేటీ అయ్యారు. మరోవైపు క్యాంపు రాజకీయాలను పర్యావేక్షించేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను అధిష్ఠానం రంగంలోకి దింపింది. చివరికి సీఎల్పీగా రేవంత్ రెడ్డిని నియమిస్తూ… కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది. అదే రోజు రాత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ పెదదలను కలవగా… డిసెంబర్ 9 వరకు వేచి చూడకుండా డిసెంబర్ 7న తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం
డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, పది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం కొలువు దీరిన సమయంలోనే అటు ప్రగతి భవన్ ముందు ఉన్న ఇనుప కంచెలను తొలగించి… తమది ప్రజా ప్రభుత్వమని ప్రమాణ స్వీకార వేదిక నుంచే రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజా భవన్ పేరును మహాత్మా జ్యోతిరావుఫూలే ప్రజాభవన్‌గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయంలోకి ప్రజలు రావడంపై ఉన్న ఆంక్షలను ఎత్తేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందే స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రకటించింది కాంగ్రెస్ అధిష్ఠానం.
డిసెంబర్ 9న తెలంగాణ మూడవ శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి. వివిధ పార్టీల నుంచి అసెంబ్లీకి గెలిచిన వారు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలలో కీలకమైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే రెండు పథకాలను మొదలుపెట్టామని ఇది తమ ప్రభుత్వ ఘనత అంటూ హస్తం నేతలు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను అన్నింటినీ నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని కాంగ్రెస్ నాయకులు చెబుతూ వచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచే ఈ ప్రభుత్వం కూలిపోతుందని విమర్శలు వినిపించాయి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఫిరాయింపులను వ్యతిరేకించిన హస్తం పార్టీ… అధికారం చేపట్టాక… ప్రభుత్వాన్ని పటిష్టం చేసేందుకు చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది. హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్న తెలంగాణ హస్తం నేతలు మొదట బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను పార్టీలో చేర్చుకున్నారు. తర్వాత తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, అరికపూడి గాంధీ ఇలా మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలకు పదవులు ఇచ్చేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినా… బీఆర్ఎస్ నుంచి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలకు పదవులు కట్టబెట్టింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. ఆ ఎన్నికల సమయంలో కేంద్రంలో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లకు ఎత్తేస్తారని అంశాన్ని రేవంత్ రెడ్డిలో విస్తృతంగా ప్రచారం చేశారు. అనంతరం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సైతం అదే అంశాన్ని ప్రచారం చేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా రాకుండా చేస్తానని శపథం చేసిన రేవంత్… ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు చెరో 8 సీట్లు… సాధించగా MIM హైదరాబాద్ స్థానాన్ని కాపాడుకుంది.
నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పెద్దలు… పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇచ్చారు. ఒకే దఫాలో 38 మందికి కార్పొరేషన్ పదవులు వచ్చాయి. పార్టీ అనుబంధ సంఘాల్లో చురుకుగా పనిచేసిన వారికి పదవులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందనే మేసేజ్ ఇచ్చింది. ఇక చట్టసభలకు ఎంపిక విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ యువకులను ఎంపిక చేసింది. అనిల్ కుమార్ యాదవ్‌ను రాజ్యసభకి, బల్మూరి వెంకట్‌ను మండలికి పంపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన మహేష్ కుమార్ గౌడ్‌ని సైతం ఎమ్మెల్సీని చేసింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలలో రెండు స్థానాలను భర్తీ చేయాల్సిన అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను ఎంపిక చేయగా… ముస్లిం హక్కుల నేత, జర్నలిస్టు అమీర్ అలీ ఖాన్‌ను రెండో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియడం… ముఖ్యమంత్రిగా రెండు బాధ్యతలు భారం కావడంతో త్వరగా పీసీసీ చీఫ్‌ని నియమించాలని అధిష్టానాన్ని రేవంత్ కోరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కీ పేర్లు వినిపించినా… మహేష్ గౌడ్ వైపే అధిష్ఠానం మొగ్గుచూపింది. మహేష్ గౌడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీకి ప్రభుత్వానికి గ్యాప్ తగ్గించే అంశంపై దృష్టి పెట్టారు. పార్టీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు గాంధీ భవన్‌లో మంత్రులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వారంలో రెండు రోజులు మంత్రులు గాంధీ భవన్‌కి వచ్చేలా షెడ్యూల్ రూపొందించి మంత్రులతో ముఖాముఖి అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం పార్టీలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం మొదలు పెట్టినా… సాధారణ జనాలు కూడా వచ్చి తమ సమస్యలు చెప్పుకునేందుకు వేదికగా మారింది.
పార్టీలో నూతన చేరికలతో పలు నియోజకవర్గాల్లో కొత్త, పాత నేతల మధ్య వర్గ పోరు పార్టీకి తలనొప్పిగా మారింది. వీటిని పరిష్కరించేందుకు పీసీసీ చీఫ్ జిల్లాల సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వాటిని తిప్పికొట్టాలని పలు కార్యక్రమాలు నిర్వహించారు. గత ప్రభుత్వం గోరంత అభివృద్ధి చేసి కొండంత చెప్పుకునేదని… కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించడంలో విఫలం అవుతున్నామని పార్టీ భావించింది. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికే అవకాశం ఇస్తామని… ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
నేతల్లో అసంతృప్తి
మంత్రి వర్గ విస్తరణ, పూర్తి స్థాయిలో నామినేటెడ్ పోస్టుల భర్తీని చేయకపోవడంతో నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఇక రుణమాఫీ సంపూర్ణంగా చేయకపోవడం, రైతు భరోసా ఇవ్వకపోవడం, వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి… ఖజానాలో డబ్బులు లేకపోవడంతో పథకాలు అన్ని అనుకున్న సమయానికి చేయలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న దాడిని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ విఫలమవుతున్నట్లు పార్టీ క్యాడర్ సైతం చర్చించుకుంటుంది.
మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి 2024 బాగా కలసి వచ్చింది. పరిపాలనలో సీఎం రేవంత్ రెడ్డికి పెద్దగా అనుభవం లేకపోయినా.. పలువురు మొదటిసారి మంత్రి వర్గంలో అడుగు పెట్టినా సంవత్సరం పాటు సక్సస్ ఫుల్‌గా నెట్టుకొచ్చారు. ఏడాది పూర్తికావడంతో… ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శల స్థాయిని పెంచే అవకాశం ఉంది. సీనియర్ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా… ఎక్కడా బయటపడలేదు. కానీ భవిష్యత్తులో ఒరిజనల్ కాంగ్రెస్ నేతల స్వరం మారితే రేవంత్‌కి ఇబ్బందే. మరి దాన్ని సీఎం ఎలా ఓవర్ కమ్ చేస్తారో చూడాలి.