సంక్రాంతి సందర్భంగా పట్నం ప్రజలు పల్లె బాట పట్టారు. సొంతూరులో పండుగ జరుపుకునేందుకు ఉత్సాహంగా వెళ్తున్న నగర వాసులకు టికెట్ ధరలు దడ పుట్టిస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు నుంచి విశాఖ వెళ్లే వారికి విమాన టికెట్ ధరలు షాక్‌కు గురిచేస్తున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు నుంచి కనీస ధర రూ.3400 నుంచి రూ.4వేలు ఉండగా.. ప్రస్తుతం మూడు నాలుగు రెట్లు పెరిగిపోయింది. శని, ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి కనీస ఛార్జీ రూ.17,500 కంటే ఎక్కువగా ఉంది. ఇక బెంగళూరు నుంచి విశాఖ వెళ్లాలంటే కనీసం రూ.12వేలు పెట్టాల్సి వస్తుంది. సొంతూరులో పండుగ జరుపుకోవాలన్న ప్రయాసతో వేల రూపాయలైనా వెనుకాడకుండా టికెట్ కొనుక్కొని ప్రయాణాలు సాగిస్తున్నారు.
మరోవైపు ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. మూడు నెలల కిందటే టికెట్ బుక్ చేసుకున్నా వెయిటింగ్ లిస్టులు చాతాండంత ఉన్నాయి. ప్రత్యేక రైళ్లు, బస్సులు వేసినా కూడా వెంటనే నిండిపోతున్నాయి. అందుకే ప్రత్నామ్నాయంగా విమాన టికెట్లకు భారీగా డిమాండ్ పెరిగింది.