ఆరుగాలం కష్టించే రైతన్నకు సాయం చేయడమే ప్రధాన ఉద్దేశంగా తీసుకొచ్చిన రైతు బంధుపై విమర్శల జోరు రోజు రోజుకూ పెరుగుతోంది. అప్పోసప్పో చేసి రాత్రి పగలూ శ్రమించే రైతన్నలకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించ డంపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ, ఈ క్రమంలోనే బడాబాబులు, కోటీశ్వరులు, రియల్టర్లు, ఇలా చెప్పు కుంటూ పోతే ఎంతో మంది పెద్ద వాళ్లకు సైతం రైతు బంధు అందడమే విమర్శలకు కారణమవుతోంది.
నిజానికి గత ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధుతో ఎన్నో లక్షలాది మంది అన్నదాతలకు ప్రయోజనం కలిగింది. అదే సమయంలో రాజకీయ నేతలు మొదలు లక్షలాది రూపాయలు ఇన్‌కం ట్యాక్స్ కట్టే వారి వరకు ఈ రైతు బంధు డబ్బు లు పడడంపై అప్పట్లోనే ఎన్నో విమర్శలు తలెత్తాయి.
లెక్కల ప్రకారం చూస్తే..గత ప్రభుత్వం ఇప్పటివరకు 11 విడతల్లో కలిపి 72వేల కోట్లకుపైగా చెల్లింపులు చేసినట్లు తెలు స్తోంది. ఇక, 20 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 319 కోట్ల మేర చెల్లించిందని స్పష్ట మైంది. రియల్ ఎస్టేట్, ఇతర వాణిజ్య అవసరాల కోసం ఖాయిలాపడిన భూములు, సాగులో లేని భూములకు రైతు బంధు రూపంలో 13 వేల కోట్లకు పైగా చెల్లించారు.
ఈ నేపథ్యంలోనే ఐదు నుంచి పదెకరాలు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలన్న డిమాండ్లు మేధావులు, విద్యావంతులు, రైతు సంఘాల నుంచి విన్పిస్తున్నాయి. ఇప్పటికే వందలు, వేల కోట్లకు అధిపతులైన వారికి రైతు బంధు సాయం అందడంలో అర్థం లేదంటున్నారు ఆయా వర్గాల ప్రజలు. మరి ఈ విషయంలో రేవంత్ సర్కారు ఎలా స్పందిస్తుంది ? రాబోయే రోజుల్లో అనర్హులకు రైతు బంధు సాయం అందకుండా చేస్తుందా ? దీనిపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది.