ఫ్రాన్స్‌లో మరోసారి తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలు.. గత వారం చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోసారి పెద్దఎత్తున నిరసనలకు పిలుపునిచ్చిన తరుణంలో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇందులో భాగంగా మార్సెయిల్, లియాన్ నగరాల్లో నిరసనలను నిషేధించడంతోపాటు పారిస్‌లోని ప్రధాన మ్యూజియాలను మూసివేశారు. దేశవ్యాప్తంగా సుమారు 70 వేల మంది పోలీసులను మోహరించినట్లు అధికారులు వెల్లడించారు.
విధ్వంసాలు, అల్లర్లు పునరావృతం కాకుండా హెలికాప్టర్లు, సాయుధ వాహనాలు, వాటర్ క్యానన్లతో భద్రతను పటిష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా హింసను ప్రేరేపించే సందేశాలు సర్క్యులేట్ అవుతుండటంతో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూలతో పాటు కఠిన ఆంక్షలు విధించారు. పాఠశాలల్లో క్షీణిస్తున్న వసతులు, విద్యా ప్రమాణాలపై హైస్కూల్ విద్యార్థులు ప్రారంభించిన ఈ నిరసనలు, పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా దేశవ్యాప్తంగా విస్తరించాయి. గత వారం జరిగిన ఆందోళనల్లో ఐదు లక్షలకు పైగా ప్రజలు రోడ్డెక్కడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
మరోవైపు నిరసనకారులు తలపెట్టిన మార్చ్ రూట్‌ను పోలీసులు చివరి నిమిషంలో మార్చడంపై తీవ్ర వివాదం చెలరేగింది. బాస్టిలే నుంచి నేషన్ వరకు జరగాల్సిన మార్చ్ రూట్‌ను పోర్టే డి ఇటలీ నుంచి పోర్టే డి విన్సెంట్ వరకు మారుస్తున్నట్లు పారిస్ పోలీసులు ప్రకటించారు. దీన్ని ట్రేడ్ యూనియన్లు, విపక్ష నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలవంచకుండా .. తాము నిర్ణయించిన రూట్లోనే నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
హింసకు పాల్పడిన వారిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పష్టం చేశారు. ఇప్పటికే హింసాత్మక ఘటనలకు సంబంధించి 217 మందికి కోర్టులు జైలు శిక్ష విధించినట్లు న్యాయశాఖ మంత్రి గెరాల్డ్ డర్మానిన్ తెలిపారు.
ఫ్రాన్స్‌లో మరోసారి తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలు
Latest Articles
- Advertisement -


