వరుస ఎన్‌కౌంటర్‌ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ చర్చల ప్రస్తావనతో ముందుకొచ్చింది. చత్తీస్‌గడ్ సర్కార్ చర్చలపై నోరు మెదపకుండా బూటకపు ఎన్‌కౌంటర్లతో మారణహోమం సృష్టిస్తోందని మావోయిస్టు పార్టీ దండకారణ్య అధికార ప్రతినిధి వికల్ప్ మండిపడ్డారు. చర్చలకు పిలుపునిచ్చినా సర్కార్ సైలెంట్ వెనుక ఆంతర్యమేంటి..? మావోయిస్టులు అంటున్నట్లు దండకారణ్యంలో జరుగుతున్నవన్నీ బూటకపు
ఎన్‌కౌంటర్లేనా?
కొద్ది రోజులుగా చత్తీస్‌గడ్-తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, తుపాకుల తూటాలతో అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది. మావోయిస్టులను వేటాడమే టార్గెట్‌గా అడవిని జల్లెడ పట్టి.. తుపాకులతో విరుచుకుపడుతు న్నాయి భద్రతా దళాలు. దీంతో వారి వ్యూహాలకు చిక్కిన నక్సల్స్ ఎందరో ఇటీవల కాలంలో మృత్యువాత పడ్డారు. వరస ఘటనలపై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఆపరేషన్ కగార్ పేరిట బూటకపు ఎన్‌కౌంటర్లతో దండకారణ్యంలో మరణ హోమం జరుగుతోందని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ మండిపడ్డారు. 5 నెలల్లో 27 ఎన్ కౌంటర్లు, 18 ఫేక్ ఎన్ కౌంటర్లు జరిగాయని 107 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారని మృతుల్లో 45 మంది వరకు సాధారణ పౌరులే ఉన్నారని తెలిపారు. మరోపక్క ప్రభుత్వంతో చర్చకు సిద్దమని తెలిపినా స్పందించడం లేదని ఆరోపించారు. ప్రజా సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి చర్చలకు అనుకూల వాతావరణం కల్పించాలని కోరారు.
ప్రధాని మోదీ, అమిత్ షా, విష్ణు దేవ్ సాయి, విజయ్ శర్మ ఆదేశాలతోనే మావోయిస్టులపై దాడులు జరిగాయన్నారు వికల్ప్. భద్రతా బలగాల విజయాల కోసం పెద్ద సంఖ్యలో మావోయిస్టుల మృతులను చిత్రీకరిస్తున్నారని.. శత్రుదేశాలపై యుద్ధం తరహాలో మావోయిస్టులపై దాడులకు పాల్పడుతున్నారని లేఖలో తెలిపారు. భారీగా సాయుధ బలగాలను మోహరించి మారణహోమాన్ని సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. యుద్ధ ట్యాంకులను మోహరిస్తున్నారని వైమానిక దళానికి చెందిన గరుడ కమాండోలతో డ్రోన్లు, హెలికాఫ్టర్ల ద్వారా దాడులకు తెగబడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల పట్ల ప్రజాసంఘాలు, సానుభూతి పరులు అలర్ట్‌గా ఉండాలని కోరారు. దండకారణ్యంలో జరుగుతు న్న మారణ హోమానికి బీజేపీ నేతలే బాధ్యత వహించాలంటూ లేఖలో పేర్కొన్నారు నక్సలైట్ల దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్.
2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నక్సలైట్లతో చర్చలు జరిపింది ప్రభుత్వం. ఆనాడు హోంమంత్రిగా ఉన్న జానారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున చర్చలకు నక్సలైట్లను చర్చలకు ఆహ్వానించారు. నక్సల్స్‌తో ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. అలా అడవుల నుండి అన్నలను హైద్రాబాద్‌కు తీసుకువచ్చారు. అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏఓబీ సెక్రటరీ సుధాకర్, రాష్ట్రకమిటీ సభ్యుడు గణేష్, జనశక్తి నేతలు అమర్, రియాజ్‌లు హైదరాబాద్‌కు వచ్చారు. 2004 అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో నక్సలైట్ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. చర్చల ప్రక్రియ మొదలైన కాలమంతా రాష్ట్రమంతా శాంతియుత వాతావరణం కనిపించింది. మొదటి దఫా చర్చల అనంతరం మళ్లీ కథ మొదటికొచ్చింది. ఎన్‌కౌంటర్లు మళ్లీ మొదలయ్యాయి. ఏకంగా శాంతి చర్చల్లో పాల్గొన్న నక్సలైట్ నాయకుడు రియాజ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. దీంతో.. శాంతి చర్చల ప్రక్రియ అర్థాంతరంగా ముగిసింది.
ప్రధానంగా ఏపీ, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కలిపే దండ కారణ్యంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2004 తరువాత మధ్య భారతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కాల్పుల మోతలు నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలో 2010లో హింసకు స్వస్తి పలికేందుకు ఆనాటి కేంద్రమంత్రి చిదంబరం మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులు దాడి చేసి 40 మందిని హతం చేసిన నేపథ్యంలో ఆయన ఈ పిలుపునిచ్చారు. నక్సల్స్ తో చర్చలకు తేదీని ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. ఎజెండాలో మావోయిస్టులు ఏమైనా చేర్చవచ్చునని, అయితే చర్చల కాలంలో హింసకు పాల్పవడవద్దని ఆయన సూచించారు. ఈ కాలంలో ప్రభుత్వం కూడా ఏ విధమైన ఆపరేషన్ చేపట్టదని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన ప్రతిపాదనకు మావోయిస్టులు కూడా సానుకూలం గా స్పందించారు. కానీ చర్చల విధివిధానాలపై సంప్రదింపులు జరుపుతున్న మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ అధికార ప్రతినిధి ఆజాద్ ఎన్‌కౌంటర్‌తో ఆ కథ అక్కడే ముగిసిపోయింది. ప్రభుత్వం చర్చలకు పిలిచి చంపిందని అప్పుడు ప్రజాస్వామికవాదులు ఆరోపించారు. తాజాగా మావోయిస్టు పార్టీ మారోసారి చర్చల ప్రస్తావన చేసింది. ప్రభుత్వం చర్చలకు సిద్ధమంటూనే మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేసేందుకు మారణ హోమం సృష్టిస్తోందని ఆరోపించారు. కాల్పుల విరమణ ప్రకటించి, జైల్లో ఉన్న తమ నేతలను విడుదల చేస్తే, వారే ప్రభుత్వంతో మాట్లాడతారని మావోయిస్టు నేత వికల్ప్ స్పష్టం చేశారు. మరి మావోయిస్టులతో చర్చలకు సర్కారు ముందుకొస్తుందా? దండకారణ్యంలో బాంబుల మోత ఆగుతుందా? లేదంటే షరా మూమూలే అన్నట్టు ఎదురుకాల్పులతో అటవీ ప్రాంతాలు దద్దరిల్లుతాయా అనేది వేచి చూడాలి.


