మహారాష్ట్ర సీఎం ఎవరన్న ఉత్కంఠ రోజురోజుకు మరింత ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి..ముఖ్యమంత్రి అభ్యర్థిని మాత్రం ఇంకా తేల్చలేకపోతోంది. బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని ఆ పార్టీ అధిష్ఠానం అంటుంది. బీహార్ ఫార్ములా ప్రకారం ఏక్‌నాథ్ శిండేను కొనసాగించాలని శివసేన పట్టుబడుతోంది. దీనిపై సందిగ్ధం నెలకొన్న వేళ ప్రస్తుత ముఖ్యమంత్రి శిండే పెట్టిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. దీంతో సీఎం రేసు నుంచి ఆయన వైదొలుగుతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
మంగళవారం ఏక్‌నాథ్ శిండే తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం సాధించడంతో తమ ప్రభుత్వం రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతోంది. మహాకూటమిగా తాము ఎన్నికల్లో కలిసి పోటీ చేశామన్నారు. నేటికీ కలిసే ఉన్నాం..తనపై ప్రేమతో కొన్ని సంఘాల వారు తనను కలవడానికి ముంబయి వస్తామని అడుగుతున్నారు. వారి అభిమానానికి తాను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని..అయితే, తనకు మద్దతుగా అలా ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.
అదే విధంగా శివసేన కార్యకర్తలు సీఎం అధికారిక నివాసం వద్ద, మరెక్కడా గానీ గుమికూడవద్దని కోరుతున్నానని చెప్పారు. బలమైన, సుసంపన్న మహారాష్ట్ర కోసం మహాకూటమి బలంగా ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే కొనసాగుతుందని కూడా శిండే రాసుకొచ్చారు. దీంతో సీఎం రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఆయన సూచనప్రాయంగా చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మహారాష్ట్ర 14వ అసెంబ్లీ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటుకాకపోతే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుందన్న వార్తలొచ్చాయి. వాటిని అధికారులు ఖండించినప్పటికీ..కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఒకవేళ, బీజేపీకు అవకాశం వస్తే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారా అన్న దానిపైనా స్పష్టత లేదు. ఈక్రమంలోనే ఆయన ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే, తాను రాజకీయాల కోసం రాలేదని, వివాహ వేడుక నిమిత్తం ఢిల్లీకి వచ్చానని ఫడ్నవీస్ చెప్పారు.