సీఎం రేవంత్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేను సైకో అయితే,.. నువ్వు శాడిస్టువా అంటూ నిప్పులు చెరిగారు. ఇక ఈ సందర్భంగా రేవంత్ ఢిల్లీ టూర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కేటీఆర్. 28 సార్లు ఢిల్లీకి తిరిగి 28 రూపాయలు కూడా తీసుకురాలేదని సెటైర్లు వేశారు. చీకటి రాజకీయాలే తప్ప.. ప్రజల కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు. రాహుల్‌గాంధీకి, రేవంత్‌రెడ్డికి ఒక శృతి, సయోధ్య ఉందా అని ప్రశ్నించారు కేటీఆర్. అదానీ ఫ్రాడ్ అని ప్రపంచమంతా చెబుతుంటే.. రేవంత్ మాత్రం ఇక్కడ అదానీ బాకా ఊదుతారని కామెంట్స్ చేశారు.
కేసీఆర్ గురించి మాట్లాడటానికి ఎంత ధైర్యమని మండిపడ్డారు కేటీఆర్. అదానీ ఆఫర్‌ను రిజక్ట్ చేయడమే కేసీఆర్ చేసిన తప్పా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ ఇచ్చిన చెక్‌పై మాట్లాడిన కేటీఆర్. 38 రోజులుగా చెక్ అలాగే ఉంచడానికి కారణమేంటని అడిగిన ఆయన.. ఉత్త చెక్ చూపించి పైసలు తీసుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
దావోస్‌లో అదానీతో కలిసిన విషయం దాచుకోలేదని.. అఫిషియల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశామన్నారు కేటీఆర్. రేవంత్‌లా చీకటి ఒప్పందాలు చేసుకోలేదన్నారు. ఇకపోతే శైలజ మృతిపై కూడా స్పందించారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల్లో 48 మంది చనిపోయారని తెలిపారు కేటీఆర్. బాధిత కుటుంబాలకు పార్టీ తరపున ఆయన సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా రేవంత్ పాలనపై విమర్శలు గుప్పించారు.