కక్ష కట్టడానికి అవేం మనుషులు కావు. పగ పట్టడానికి పాములు కావు. కక్షలు, పగలు లేకపోయినా బీభత్సకాండ మాత్రం సాగించేస్తున్నాయి. ఊరి వారందరినీ కళ్లనీళ్లు పెట్టించేస్తున్నాయి. కంటి మీద కునుకు కరువు చేస్తున్నాయి. మానవ జాతిలో కంట్రోల్ చేయడానికి వీల్లేనంత విలన్లలా మారిన సైబర్ కేటుగాళ్ల మాదిరి తయారై ఆ గ్రామస్థులకు ఇక్కట్లు సృష్టిస్తున్నవి ఏవో తెలుసా…? ఇవిగో ఇవే.
అదేం అడవీ కాదు. చెట్లు, పుట్ల మయంగా ఉండే పార్కుకాదు. అన్నీ సమపాళ్లలో ఉండే ఓ కుగ్రామం. గ్రామస్థులు అందరూ ఏకమాటపై నిలిచి, ఏక బాటలో సాగుతారు. అయితే, ఆ గ్రామంలో ప్రతి నిత్యం వైరవాతావరణమే కనిపిస్తోంది. ఇదేం చోద్యం అందరూ ఐకమత్యంగా ఉంటారు అంటూనే ప్రతి క్షణం వైరం సాగించడం ఏమిటని కదా..! అనుకుంటున్నారు. ఆ గ్రామస్థులు ప్రతి నిత్యం సాగించే వైరం… వాళ్లలో వాళ్లు కాదు. వాళ్లందరూ కలిసి మర్కటాలతో ఈ వైరం సాగిస్తారు. వామ్మో వానరాలు.. కుయ్యో కోతులు.. మొర్రో మర్కటాలు…ఇవీ సిక్కోలు వాసుల ఏడుపులు, పెడబొబ్బలు
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం గూడెం గ్రామం.. ఎక్కడుంది.. సాక్షాత్ ఓ రాష్ట్ర మంత్రి నియోజకవర్గంలో పల్లె ఉంది. ఈ నియోజకవర్గంలో కోతుల దండు సంచారం నిత్యకృత్యం అయ్యింది. ఏ గణాంక వేత్తలైనా ఇక్కడ స్టేటిస్టిక్స్ తీస్తే… గూడెం గ్రామంలో మనుషుల సంఖ్య కంటే కోతులే ఎక్కువ అని తేల్చిపారేస్తారు. ఎక్కడో అడవుల్లోనో, కొండ గుట్టల్లోనో అంత భారీస్థాయిలో కోతుల గుంపును చూడ్డం జరుగుతుంది కానీ, కుగ్రామంలో ఇన్ని కోతులు ఏమిటని..ఎవరైనా ముక్కున వేలేసుకున్నా.. ఇది మాత్రం నిజంగా నిజం.
కోతిబుద్ధి అని ఊరికే అంటారా..? కోతులు ఊరికే కూర్చోవు కాబట్టే…ఈ కితాబులన్నీ ఇస్తూంటారు. గ్రామస్థుల పంట పొలాలపై ఒకవైపు దాడులు సాగిస్తూనే, మరోవైపు గ్రామంలో నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏ కర్రలో, కటార్లో పట్టుకుని గ్రామస్థులు వస్తుంటే, కమ్ ఫైట్, కమాన్ ఫైట్ అన్నట్టు ఎదురుదాడికి దిగుతున్నాయి. తమ పొలాలు, ఇళ్లపై దాడులు సాగించడమే కాకుండా, ఎదరెట్టి చదరంగా ఆడిన మాదిరి తమపైనా కలవబడి గాయాలు పాలు చేస్తున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. కోతుల మంద దాడులపై తట్టుకోలేనంత కోపం, ఆవేశం వచ్చినా.. గ్రామస్థులు ఏం చేయలేక నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు.
గత అయిదారు నెలలుగా వందల సంఖ్యలో కోతుల గుంపు గూడెం గ్రామ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పంటలు నాశనం చేయడమే కాకుండా గ్రామంలోకి ప్రవేశించి గ్రామస్థులపైనా వానరాలు దాడులకు దిగుతున్నాయి. గ్రామస్తులు పొలం పనులకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. కోతుల వల్ల ఇప్పటికే మొక్కజొన్న, కూరగాయలు, పండ్ల తోటలు చాలావరకు నాశనం అయిపోయాయి. పెసర, మినప పంట రైతుల చేతికి అందకుండా పొలంలోనే నేలమట్టం అయ్యింది.
పొలాలకు వెళ్లడానికి భీతిల్లుతున్న గ్రామస్థులను ఇళ్లలోనూ ఉండనీయకుండా కోతులు ఏడిపించేస్తున్నాయి. ఇళ్లల్లో చొరబడి ఏది దొరికితే అది దొంగల మాదిరి ఎత్తుకెళ్లిపోతున్నాయి. తమ ఇబ్బందులను అటవీశాఖ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని గ్రామస్థులు ఆవేదన చెందారు. అయితే, ఇంతవరకు జరిగిన నష్టం ఒక ఎత్తు అయితే గ్రామంలో ఎక్కువగా ఉన్న మామిడితోటలపైనా కోతుల ప్రభావం పడే పరిస్థితి కనిపిస్తోంది. అధిక శాతం మంది గ్రామస్థులు ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. పెసర, మినుములు పంటలు నష్టం పోయాం, ఇప్పుడు మామిడి పంటకు నష్టం కలిగేలా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కోతుల వల్ల చిన్నపిల్లలకు ఏం ప్రమాదం సంభవిస్తుందో అని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఇంటి పైన ఉన్న టీవీ డిష్ లను సైతం కోతులుఏ విరగొట్టి పారేస్తున్నాయని గ్రామస్థులు కళ్లనీళ్లు పెట్టుకుంటున్నారు. కోతుల బెడదకు టీవీ డిష్ లు పై ముళ్ళుకంపలు పెట్టుకుంటున్నామని తెలిపారు. దేవాలయాల్లో సైతం చొరపడి కోతులు నానా హంగామా చేస్తున్నాయని అర్చకులు వాపోతున్నారు. తమ గ్రామం గోడు వినేనాధుడే లేరా..? అంటూ గూడెం గ్రామస్తులు మధన పడుతున్నారు.
ఇంత వరకు పెసర, మినిము తదితర పంట నష్టాలు జరిగినా అధికారులు కనీసం స్పందించలేదని గ్రామస్థులు అన్నారు. ఇక మామిడి పంటను కోతులు పాడుచేస్తే..మా గతేమిటి అంటున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు ఆఘమేఘాల మీద రంగంలోకి దిగి కోతుల అత్యుత్సాహానికి బ్రేక్ వేయాలని, తమను నిరుత్సాహం నుంచి దూరం చేయాలని గ్రామస్థులు వేడుకొంటున్నారు. లేదంటే..గూడెం గ్రామం మర్కటమయ గ్రామంగా మారిపోయేలా ఉందని కళ్లనీళ్లుపెట్టుకుంటున్నారు. ఇంకా అటవీశాఖ, అధికార గణాలు మీన మేషాలు లెక్కిస్తూ కూర్చుంటే.. తమ కష్ట, నష్టాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
—-