బీసీ జాబితాలో ముస్లింలను చేర్పిస్తే ఆమోదించే ప్రసక్తే లేదని హెచ్చరించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారాయన. ఈ విషయం తెలిసి కూడా కేంద్రంపై నెట్టాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ది కాంగ్రెస్ కు లేదని తేటతెల్లమైందని ఆరోపించారు.
బీసీల్లో ముస్లింలను చేర్చడంవల్ల బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కకుండా పోతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరింత అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ముస్లింలను బీసీల్లో కలిపితే హిందూ సమాజమంతా తిరగబడటం ఖాయమని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పడం తథ్యమన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ కు చిత్తశుద్ది ఉంటే బీసీ జాబితాలో నుండి ముస్లింలను తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిందేనని అన్నారు. ఇచ్చిన మాట తప్పుతూ బీసీలను నిండా ముంచుతున్న పార్టీ కాంగ్రెస్సేనని అన్నారు. బీసీలంతా కాంగ్రెస్ మోసాలను గుర్తించాలని కోరుతున్నానని అన్నారు.
స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము కాంగ్రెస్ కు లేదన్నారు బండి సంజయ్. మార్చిలోపు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే తెలంగాణకు నష్టమని తెలీదా? అని ప్రశ్నించారు. 15వ గ్రాంట్స్ కమిషన్ నిధులు ఆగిపోతాయని తెలిసి కూడా జాప్యం చేస్తారా అని నిలదీశారు. ఇప్పటికే రెండు దఫాలుగా నిధులు రాలేదన్న బండి సంజయ్.. 73,74వ రాజ్యాంగ సవరణలను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు.
స్థానిక సంస్థలకు ఐదేళ్లకోసారి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగం చెబుతోందని చెప్పారు. మీరు ఆమోదించిన రాజ్యాంగాన్ని మీరే అవమానిస్తారా? అంటూ మండిపడ్డారు. రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరగడం కాదు…. రాజ్యాంగాన్ని అమలయ్యేలా చూడాలని సూచించారు. సర్పంచ్ లేకుంటే గ్రామ సభలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు జరిగేదెలా? అంటూ ప్రశ్నించారు.
గ్రామాల్లో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నా పట్టించుకోరా? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓడిపోతామనే భయానికే స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదని ఆరోపించారు బండి సంజయ్.