తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్‌కి కొత్త ఇంచార్జీగా నియమితురాలైన మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నూతన ఇంచార్జీగా నియమితురాలైన మీనాక్షి ఏ రేంజిలో ఎంట్రీ ఇస్తారోనని అంతా అనుకున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆమె.. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రైల్లో వచ్చారు.
హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో రైలు దిగిన ఆమెను చూసి కాంగ్రెస్ శ్రేణులే విస్తుపోయాయి. ఆమె చాలా సింపుల్‌గా ఉన్నారు. హంగు ఆర్బాటాలకు దూరంగా ఉంటారని అర్ధమైంది. భుజానికి ఓ హ్యాండ్ బ్యాగ్, ఓ లగేజీ బ్యాగ్‌తో చాలా సింపుల్‌గా రైలు దిగిన ఆమెకు టీపీసీపీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ కండువాతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కనీసం బొకేలు, పూల మాలలు కూడా కనిపించలేదు.
స్పెషల్ ఫ్లైట్‌లో వచ్చే హోదాలో ఉండి కూడా సామాన్య కార్యకర్తలా ట్రైన్ లో హైదరాబాద్‌కు రావడాన్ని బట్టి ఆమె ఎంత సింపుల్‌గా ఉంటారో అర్ధమైంది. సహజంగానే హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉంటారామె. గాంధీజీ, నెహ్రూ, కాంగ్రెస్ సిద్ధాంతాలు, భావజాలం ఆమెలో నరనరాన ప్రవహిస్తుంటాయట. తాను వస్తున్నాని స్వాగత తోరణాలు, భారీ ఫ్లెక్సీలు, కటౌట్స్, బొకేలు, శాలువాలు అంటూ హడావిడి చేయొద్దు అని రాష్ట్ర నాయకులకు అంతకుముందే ఆదేశాలు పంపించారు. అందుకే రైల్వే స్టేషన్‌లో ఆమెకు స్వాగతం పలికే సమయంలో ఎక్కడా బుకేలు కనిపించలేదు.
రైల్వే స్టేషన్ నుంచి మీనాక్షి.. మహేశ్ కుమార్ ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి నేరుగా దిల్ కుషా గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. అక్కడ ఆమెకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖలతో పాటు కొందరు పార్టీ ముఖ్యులు స్వాగతం పలికారు. ఇక్కడ మాత్రం సీఎం రేవంత్ ఓ బొకే, మరో శాలువాతో ఆమెను సత్కరించారు. అంతటితో స్వాగత కార్యక్రమాలను పూర్తి చేసుకున్న నటరాజన్… నేరుగా కార్యరంగంలోకి దిగిపోయారు. సీఎం, టీపీసీసీ చీఫ్ లతో ఆమె వేర్వేరుగా భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితులపై వారి నుంచి ప్రాథమిక వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా పార్టీలోని వర్గ విభేదాలు, ఇటీవల చోటుచేసుకున్న పలు కీలక పరిణామాలను రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
చూడటానికి సాదాసీదాగా కనిపిస్తున్న మీనాక్షి నటరాజన్… పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ బృందంలో అత్యంత ముఖ్యురాలుగా కొనసాగుతున్నారు. దేశవ్యాప్తంగా పార్టీ తీవ్ర విపత్కర పరిస్థితుల్లో ఉంది. అధికారంలో ఉన్న రాష్ట్రంలో అయినా పార్టీని చక్కదిద్దకపోతే కష్టమేనన్న భావనతో రాహుల్ గాంధీనే స్వయంగా మీనాక్షిని రంగంలోకి దింపారని తెలుస్తోంది.
ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య మీటింగ్, తీన్మార్ మల్లన వ్యవహారం.. ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడానికి అవకాశమిచ్చినట్టైంది. పార్టీలో అంతర్గత విభేదాలను చక్కదిద్దడంలో గత ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ విఫలమయ్యారని.. అందుకే ఆమె స్థానంలో మీనాక్షిని పంపించినట్టు తెలుస్తోంది. చూడటానికి ఆమె సింపుల్‌గానే ఉన్నా.. పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడంలో ఆమె దిట్ట. గీత దాటితే కఠినంగా వ్యవహరించే నేతగా ఆమెకు పేరుంది. మరి తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను ఏ మేరకు చక్కదిద్దుతారో చూడాలి మరి.


