ఏపీలో సోషల్ మీడియా పోస్టులపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియా కార్యకర్తలు, సానుభూతిపరుల్ని రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వెంటాడుతోంది. ఇప్పటికే వందల సంఖ్యలో కేసులు కూడా నమోదు చేసింది. అలాగే చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై హైకోర్టులో సైతం హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో గతంలో కూటమి నేతలపై విమర్శలు చేసిన వారంతా దారికొస్తున్నారు. ఈ నేపథ్యంలో… నటి శ్రీరెడ్డి ఆసక్తికర వీడియోతో తెరపైకి వచ్చారు. గతంలో చేసిన వ్యాఖ్యలకు… లోకేష్‌కు, పవన్ కల్యాణ్‌కు, అనితకు సారీ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. వారి కుటుంబ సభ్యులకు కూడా సారీ చెబుతున్నానని వెల్లడించారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు తనను క్షమించాలని కోరారు. వారిపై తాను సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టానని, ఇక నుంచి అలా చేయనని తెలిపారు. తనలా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలను సైతం క్షమించాలని ఆమె కోరారు. తన కుటుంబం, భవిష్యత్తు దృష్ట్యా తలవంచి వేడుకుంటున్నానని పేర్కొన్నారు. రాజకీయ యుద్ధం లీడర్ల మధ్య మాత్రమే ఉండాలని, కార్యకర్తలను వదలిపెట్టాలని శ్రీరెడ్డి విజ్ఞప్తి చేశారు.