ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. సంకల్ప యాత్ర పార్ట్ ఒన్ పేరుతో మేనిఫెస్టోను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా విడుదల చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా మధ్య తరగతికి , మహిళలకు బీజేపీ పెద్ద పీట వేసింది.
ఢిల్లీలో ఈసారి బీజేపీ ప్రభుత్వం వస్తే, మహిళా సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేస్తామన్నారు ఆ పార్టీ నాయకులు. మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. అలాగే గర్భిణీలకు రూ. 21 వేల ఆర్థిక సాయం అందచేస్తామన్నారు. అలాగే ఆరు పౌష్టికాహార కిట్లు ఇస్తామన్నారు.
మధ్య తరగతి వర్గానికి అనేక వరాలు ప్రకటించింది బీజేపీ మేనిఫెస్టో. పేద, మధ్య తరగతి వర్గాలకు ఎల్పీజీ సిలిండర్లపై రూ. 500 సబ్సిడీ అందచేస్తామన్నారు. అలాగే ప్రతి హోలీ పండుగ అలాగే దీపావళి పండుగకు ఒకటి చొప్పున ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందచేస్తామన్నారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఆయుష్మాన్ భారత్ ను ఢిల్లీలోనూ అమలు చేస్తామన్నారు. ఆయుష్మాన్ భారత్‌కు అదనంగా ఐదు లక్షల రూపాయల ఆరోగ్య కవరేజీ ఇస్తామని మేనిఫెస్టోలో బీజేపీ స్పష్టం చేసింది. అలాగే సీనియర్ సిటిజన్లపై కూడా వరాల జల్లు ప్రకటించింది బీజేపీ మేనిఫెస్టో. అరవై నుంచి డెబ్భయి ఏళ్ల మధ్య వయస్సున్న పెద్దవారికి రూ. 2,500 పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అంతేకాదు డెబ్భయి ఏళ్లు పై బడినవారికి రూ. 3,000 అందచేస్తామన్నారు.
పేదలకు తక్కువ ధరకే కడుపునిండా భోజనం పెట్టే కార్యక్రమానికి ప్రాధాన్యం ఇచ్చింది బీజేపీ మేనిఫెస్టో. ఇందులో భాగంగా జేజే క్లస్టర్లలో అటల్ క్యాంటీన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్యాంటీన్‌లలో కేవలం ఐదు రూపాయలకే కడుపునిండా భోజనం పెడతారని మేనిఫెస్టో వెల్లడించింది. కాగా పేద, మధ్యతరగతి సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు కమలం పార్టీ ప్రణాళిక పేర్కొంది. ఢిల్లీలో ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాలు అన్నిటినీ అలాగే అమలు చేస్తామన్నారు.ఈ సంక్షేమ పథకాలను నిలిపివేసే ప్రసక్తే లేదని బీజేపీ మేనిఫెస్టో స్పష్టం చేసింది. కాగా ఫిబ్రవరి ఐదున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా ప్రధాన నరేంద్ర మోడీ ఛరిష్మా పనిచేస్తున్నా , ఢిల్లీలో మాత్రం అది వర్క్ అవుట్ కావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా అలాగే కేంద్ర హెమ్ మంత్రి అమిత్ షా చాణక్యాన్ని తట్టుకుని రెండుసార్లు ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు అరవింద్ కేజ్రీవాల్. అయితే కొంతకాలం కిందట ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగు చూసింది.ఈ స్కామ్ నేపథ్యంలో కేజ్రీవాల్ పై కేంద్ర దర్యాప్త సంస్థలైన ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. ఒకదశలో కేజ్రీవాల్ జైలుకు కూడా వెళ్లారు. అయితే బెయిల్ పై జైలు నుంచి విడుదల అయిన తరువాత ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఆప్ సీనియర్ నేత అతీశీని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చో బెట్టారు. దీంతో ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని ఆయుధంగా చేసుకుని ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ ముప్పేట దాడి చేస్తోంది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన నివసించిన ప్రభుత్వ బంగ్లాను శేష్ మహల్ తో పోల్చారు ప్రధాని నరేంద్ర మోడీ.
భారతీయ జనతా పార్టీ కొంతకాలంగా దూకుడు మీదుంది. లోక్‌సభ ఎన్నికల్లో గతంతో పోలిస్తే, బీజేపీకి తక్కువ సీట్లే వచ్చాయి. దీంతో ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పక్షాల సాయంతో కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ తరువాత జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ సత్తా చూపింది. హర్యానాలో హ్యాట్రిక్ కొట్టింది భారతీయ జనతా పార్టీ. ఆ తరువాత ప్రతిష్టాత్మకమైన మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వంలోని మహుయుతి కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో ఈసారి ఎలాగైనా ఢిల్లీలో పాగా వేయాలని కమలం పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది.