దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు అవసరమైన అన్ని విధానపరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. దశాబ్దకాలంగా పెట్టుబడులకు భారతదేశం స్వర్గధామంగా మారిందన్నారు. ఎలెక్ట్రిక్ మొబిలిటీ రంగంలో తమ భవిష్యత్తును రూపొందించుకోవాలని భావిస్తున్న ప్రతి పెట్టుబడిదారుడికి భారతదేశం అత్యుత్తమ గమ్యస్థానంగా నిలుస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్బంగా దిగ్గజ వ్యాపారవేత్తలు రతన్ టాటా, ఒసాము సుజుకి పేర్లను ఆయన ప్రస్తావించారు. భారతదేశ ఆటోరంగ అభివృద్దికి అటు రతన్ టాటా ఇటు ఒసాము సుజుకి అద్భుతమైన సహకారాన్ని అందించారన్నారు. వారి లెగసీ, భారతదేశంలో ఆటో రంగ అభివృద్దికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారత్ మొబిలిటీ ఎక్స్ పో – 2025 ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయవంతమైందన్నారు. కాగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ఆటో పరిశ్రమ అభివృద్ది కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ దశాబ్దం చివరకు ఎలెక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఎనిమిది రెట్లు పెరుగుతాయన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధానంగా గ్రీన్ టెక్నాలజీ, ఎలెక్ట్రిక్ వాహనాలు, జీవ ఇంధనాల అభివృద్ధిపై భారతదేశం దృష్టి పెడుతుందన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఐదేళ్ల కిందట ప్రారంభించిన ఫ్రేమ్ టూ పథకం కింద రూ. 8,000 కోట్లకు పైగా సబ్సిడీ ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ సబ్సిడీల ఫలితంగా దేశవ్యాప్తంగా 16 లక్షలకు పైగా ఎలెక్ట్రిక్ బస్సులు ఏర్పాటయ్యాయన్నారు. ఒక్క ఢిల్లీ నగరంలోనే 1200 కంటే ఎక్కువ
ఎలక్ట్రిక్ వాహనాలు నడుస్తున్నాయని ప్రధాని మోడీ వెల్లడించారు.
గతంలో భారతదేశంలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. అయితే దశాబ్దకాలంలో నాణ్యమైన రోడ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. దీంతో కార్లు ప్రత్యేకంగా ఎలెక్ట్రిక్ వాహనాలు కొనడానికి దేశ ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు రెండున్నర కోట్లకు పైగా కార్ల అమ్మకాలు జరుగుతున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. అలాగే ఎలెక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు.
భారతదేశంలో ఆటో రంగం అభివృద్ధికి అనేక కారణాలున్నాయని ప్రధాని మోడీ వివరించారు. పట్టణీకరణ వేగవంతం కావడం ఇందుకు ప్రధాన కారణమన్నారు. అలాగే మధ్యతరగతి పెరగడం మరో కారణమన్నారు.ఇదిలా ఉంటే , భారత్ ఎక్స్ పో …ఈనెల 22వ తేదీ వరకు జరుగుతుంది. ఈ సందర్బంగా వివిధ ఆటో కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులను ఈ ఎక్స్ పో ప్రదర్శించారు.