స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తనకు బాధలు చెప్పుకున్న రైతులపై కేసులు పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులను పరామర్శించేందుకు రాజమహేంద్రవరం పర్యటన రానున్నానని తెలియడంతో రాత్రికి రాత్రే ధాన్యం సంచులు ఇచ్చారని విమర్శించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులతో సమావేశమైన పవన్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన పవన్ ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
నష్టపోయిన రైతులను సీఎం జగన్ తో పాటు వ్యవసాయ మంత్రి పరామర్శించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం పావలా వడ్డీకి ఎకరానికి రూ.25 వేలు రుణం ఇస్తే సరిపోతుందని రైతులు చెబుతున్నారని.. అలాంటి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి నడిబొడ్డు నుంచి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.. రైతులపై లాఠీచార్జీలు చేసినా, బైండోవర్ కేసులు పెట్టినా వైసీపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.