స్వతంత్ర వెబ్ డెస్క్: జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో దాదాపు రెండున్నర నెలల తర్వాత ఇంటర్నెట్ సేవలను పాక్షికంగా పునరుద్ధరించారు. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలకు అనుమతించిన ప్రభుత్వం.. మొబైల్ ఇంటర్నెట్ సేవలపై మాత్రం నిషేధం కొనసాగించింది. అలాగే సోషల్‌మీడియా వెబ్‌సైట్లనూ నిలిపివేశారు. వైఫై హాట్‌స్పాట్లకు అనుమతి లేదు. యూజర్లు వీపీఎన్ సాఫ్ట్‌వేర్లను తొలగించాలని, కొత్త వాటిని ఇన్‌స్టాల్ చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మీతీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో మే 3 నుంచి మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ ఘటన పార్లమెంట్‌ను సైతం కుదిపేస్తున్నది. మణిపూర్ అంశంపై ప్రభుత్వం చర్చ జరుపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాల అలసత్వం వల్లే రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.