స్వతంత్ర వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం ‘బ్రో’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ‘వినోదయ సీతమ్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని… అదే డైరెక్టర్ సముద్రఖని డైరెక్ట్ చేశాడు. మాటాల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అంటే రిలీజ్ కి మరో 20 రోజులు మాత్రమే టైం ఉంది. అందుకే ప్రమోషన్స్ ను ఫుల్ స్వింగ్ లో ప్రారంభించారు.
ఆల్రెడీ టీజర్‌ను రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాన్సెప్ట్ సాంగ్ ను కూడా విడుదల చేయడం జరిగింది. దానికి కూడా పాజిటివ్ టాక్ వినిపించింది. ఇప్పుడు ‘మై డియర్ మార్కండేయ’ అంటూ మరో స్పెషల్ సాంగ్ ను విడుదల చేశారు. సినిమా మధ్యలో వచ్చే స్పెషల్ సాంగ్ ఇదని తెలుస్తుంది. ‘ఇంట్రో ఆపు దుమ్ము లేపు’ అంటూ ఈ సాంగ్ మొదలైంది. సంగీత దర్శకుడు తమన్ అందించిన ట్యూన్ బాగానే ఉంది కానీ వెంటనే ఎక్కేలా అయితే లేదు. మై డియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో .. మళ్ళీ పుట్టి భూమ్మీదికి రానే రావు నిజం తెలుసుకో ‘ అనే లిరిక్స్ వచ్చినప్పుడు పవన్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అభిమానులని అట్రాక్ట్ చేసేలా పవన్ ఎంట్రీ ఉంది. ఆ తర్వాత ఊర్వశి రౌతేలా ఎంట్రీ ఇచ్చి చిందులు వేయడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పాలి.
రామజోగయ్య శాస్త్రి తన ఉల్లాసమైన సాహిత్యంతో మనుషుల స్వభావం మరియు ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ప్రతిరోజూ ఓ పండుగలా ఎలా జీవించాలి అనే విలువైన సందేశాన్ని ఇచ్చారు. దుస్తులు దగ్గర నుంచి ఛాయాగ్రహణం, నృత్యం, సంగీతం ఇలా ‘మై డియర్ మార్కండేయ’ పాటకు అన్నీ చక్కగా కుదిరాయి.
ఈ సినిమాలో టైటిల్ పాత్రధారి(బ్రో)గా పవన్ కళ్యాణ్ నటిస్తుండగా, మార్క్ అకా మార్కండేయులుగా సాయి ధరమ్ నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృధ్వీ రాజ్, నర్రా శ్రీను, యువలక్ష్మి, దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుజిత్ వాసుదేవ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.