సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పటాన్‌చెరు శివారులో ఉన్న శ్రీరామ ఆటో ఫైనాన్స్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ గోదాంలో ఫైనాన్స్ బకాయిల కారణంగా సీజ్ చేసిన వాహనాలను నిల్వ ఉంచినట్లు సమాచారం. గోదాంలో ఉన్న కార్లు, టిప్పర్లు మంటలకు ఆహుతి అవుతున్నాయి.
అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో గోదాంలో ఉన్న వాహనాలకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మంటలు మరింత విస్తరించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టారు.
ఇక ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగింది అన్నదానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక మరేదైనా అనుమానాస్పద పరిస్థితులున్నాయా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
ముఖ్యంగా గోదాంలో పనిచేస్తున్న సిబ్బంది పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. లోపల ఉన్నవారు ఏమైనా మంటలు అంటించారా? అనే అనుమానంతో సీసీటీవీ ఫుటేజ్‌లు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ ఘటన స్థలానికి మీడియాకు అనుమతి నిరాకరించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అధికారుల వైఖరిపై స్థానికులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అగ్నిప్రమాదంలో ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది? ఎన్ని వాహనాలు దెబ్బతిన్నాయి? అనే పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.


