స్వతంత్ర, వెబ్ డెస్క్: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో తనకు ఎలాంటి పదవి లేదని.. కేవలం ఎంపీని మాత్రమే అని వ్యాఖ్యానించారు. మహానాడు కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని అందుకే వెళ్లలేదని తెలిపారు. ఇటీవల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ ఆఫీసు ప్రారంభోత్సవానికి పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వచ్చారని.. ఎంపీని అయినా తనను మాత్రం పిలవలేదని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలను గొట్టంగాళ్లుగా ఆయన అభివర్ణించారు.
పార్టీ అధిష్టానం సీటు ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచే సత్తా ఉందని ధీమా వ్యక్తం చేశారు. వేరే పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయని.. ప్రస్తుతానికైతే పార్టీ మారే ఆలోచన లేదని.. చిర్రెత్తితే మాత్రం కచ్చితంగా మారతానని ఆయన స్పష్టంచేశారు. మొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు చంద్రబాబు ఢిల్లీకి వచ్చినప్పుడు సమాచారం ఇచ్చారు కాబట్టి వెళ్లి తమ అధినేతను కలిశానని తెలిపారు. బీజేపీ, టీడీపీ పొత్తుపై స్పందించే స్థాయి తనకు లేదని కేశినేని వెల్లడించారు.