స్వతంత్ర, వెబ్ డెస్క్: జ్ఞానవాపి మసీదులో ఉన్న శివలింగాన్ని పూజించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అయిదుగురు మహిళలు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఆ బృందంలోని రాఖీ సింగ్ అనే మహిళా తన పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంది. ఈ కేసులోని అయిదుగురు మహిళల మధ్య విబేధాలు తలెత్తడం వల్లే రాఖీ సింగ్ తన పిటీషన్‌ను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. వేధింపులు తట్టుకోలేక మానసిక క్షోభకు గురవుతున్నానని, అందుకే ఇథినేషియా మరణాన్ని కోరుతూ ఆమె రాష్ట్రపతికి లేఖ రాసారు. అయితే ఇథినేషియా విషయంలో రాష్ట్రపతి స్పందన కోసం శుక్రవారం వరకు వేచి చూడనున్నట్లు ఆమె తెలిపారు. ఆ తర్వాత తన స్వంత నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు ఆమె వెల్లడించారు.
జ్ఞానవాపి మసీదులో ఉన్న హిందూ విగ్రహాలను ఆరాధించేందుకు అనుమతి ఇవ్వాలని ఆగస్టు 2021లో రాఖీ సింగ్‌తో పాటు మరో నలుగురు మహిళా పిటీషనర్లు కేసు దాఖలు చేశారు. అయితే ఇప్పుడు ఆ పిటీషనర్ల మధ్య విబేధాలు ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో ఉన్న శృంగార గౌరిని ఏడాదికి ఒకసారి పూజించేందుకు హిందూ మహిళలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.