స్వతంత్ర, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెకేషన్ బెంచ్ ముందు సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూధ్రా ఈ పిటిషన్ గురించి ప్రస్తావించారు. దీంతో సునీత పిటిషన్‌ను రేపు విచారించడానికి న్యాయస్థానం అనుమతించింది. దీంతో ఈ పిటిషన్ విచారణ సందర్భంగా బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ సైతం తన వాదనలు వినిపించనుంది.
కాగా వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇస్తూ మే31న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సునీత సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అవినాశ్‌పై మోపిన అభియోగాలన్నీ చాలా కీలకమైనవని పిటీషన్‌లో పేర్కొన్నారు. సీబీఐ అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదని.. తీర్పులో కొన్ని లోపాలున్నాయని తెలిపారు. అవినాశ్ ముందస్తు బెయిల్‌ను సీబీఐ కూడా వ్యతిరేకిస్తోందని పిటిషన్‌లో వెల్లడించారు.