Interview Tips |ప్రతి వ్యక్తి చదువు పూర్తైన తర్వాత.. లేదా ఓ వయస్సు వచ్చిన తర్వాత.. ఉద్యోగం చేయడం తప్పనిసరి.. ఉద్యోగం కాదంటే వ్యాపారమో లేకుండా బతకడం కోసం ఏదో ఒక పని తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా చాలామంది ఇంటర్వ్యూలకు వెళ్తుంటారు. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్లు ఎన్నో కార్యాలయాల చుట్టూ బయోడేటా పట్టుకుని తిరుగుతూ ఉంటారు. కొంతమందికి మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగాలు వస్తుంటాయి.. మరికొంత మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగాలు రావు. ఉద్యోగం అనేది మనలోని పని నైపుణ్యం ఆధారంగా వస్తుంది. కొన్ని సందర్భాల్లో మనలో పని నైపుణ్యం ఉన్నా.. ఉద్యోగం రాదు.. ఆ సమయంలో మనపై మనకే అనుమానం వస్తుంది.. నాలో లోపాలేంటి అనుకుంటూ ఉంటాం.
ఇది చాలా సింపుల్.. పని నైపుణ్యం ఉన్నా.. ఇంటర్వ్యూ సమయంలో మనం మన నైపుణ్యాన్ని లేదా మన పని తనాన్ని సరిగ్గా ఎక్స్‌ప్లేన్ చేయలేకపోవడం లేదా మన ప్రవర్తన కారణంగా ఉద్యోగం పొందలేం. ముఖ్యంగా భారత్‌లో నిరుద్యోగ సమస్య ఉంది అని వింటూ ఉంటాం. నిరుద్యోగులందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు. అందుకే సంపాదన కోసం ఏదో ఒక ఉద్యోగం తప్పనిసరి. ఈ సందర్భంలో చాలా మంది చదవులు పూర్తి చేసిన తర్వాత ఖాళీగా ఉన్నారు.. ఉద్యోగాలు లేవని వింటూ ఉంటాం. కాని వాస్తవం పరిశీలిస్తే దేశంలో యువతకు సరిపడే ఉద్యోగాలు ఉన్నాయి. కాని ఆ ఉద్యోగం చేసేందుకు అవసరమైన నైపుణ్యం ఉన్న వ్యక్తుల కొరత అధికంగా ఉంది.
నేటి పోటీ ప్రపంచంలో నైపుణ్యం ఉన్న వ్యక్తులనే ఉద్యోగాల్లో చేర్చుకోవడానికి చాలా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే కేవలం పాఠ్యపుస్తకాలను మాత్రమే చదివి పరీక్షలు రాసి.. పట్టాలు పుచ్చుకుంటున్న చాలా మంది యువత తమలో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. ప్రస్తుతం ఏ కంపెనీ అయినా.. మల్టీ టాస్కింగ్ చేయగలిగే వారిని మాత్రమే ఉద్యోగాలకు తీసుకుంటోంది. ఆ వ్యక్తి ఒక పని మాత్రమే కాకుండా.. సంస్థలో అవసరమైన ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉండాలి. కొంతమంది మల్టీ టాస్కింగ్‌కు ఇష్టపడరు. అలాంటి వారికి ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారుతుంది.
సాధారణంగా మనం ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు.. మనల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత.. ఉద్యోగంలోకి తీసుకోవాలని సదరు సంస్థ భావిస్తే.. మనల్ని ఇంటర్వ్యూ చేసిన సమయంలో డిసైడ్ చేస్తుంది. అప్పుడే మనకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడంతో పాటు.. జీత భత్యాల గురించి మాట్లాడతారు. అలా కాకుండా.. ఇంటర్వ్యూ అయిన తర్వాత.. మీకు కాల్ చేసి చెప్తాం అంటే.. ఇక మనం ఉద్యోగానికి ఎంపిక కాలేదని అర్థం చేసుకోవచ్చు. అన్ని సందర్భాల్లో ఇలా జరగాలనే నిబంధన ఏమి లేదు. కాని తర్వాత కాల్ చేస్తాం అంటే ఇక మనకు ఆ ఉద్యోగం రాదనే అర్థం చేసుకోవల్సి ఉంటుంది. అసలు ఇంటర్వ్యూకి వెళ్లేవారు ఏమి చేస్తే ఉద్యోగం వస్తుంది.. ఎలాంటి టిప్స్ పాటించాలో తెలుసుకుందాం.
Interview Tips |ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు మనం బయోడేటా తీసుకుని వెళ్లాలి. అయితే మెయిల్ చేశాం ఇక రెజ్యుమ్ పట్టికెళ్లాల్సిన అవసరం లేదనే భావనలో చాలా మంది ఉంటారు. ఆ అభిప్రాయం సరైనది కాదు. తప్పనిసరిగా మన బయోడేటా తీసుకుని వెళ్లాలి. బయోడేటాలో పూర్తి వివరాలు పొందుపర్చాలి. మన యొక్క విద్యార్హతలతో పాటు.. సాంకేతిక నైపుణ్యం, ఇతర మన అభిరుచులను ప్రస్తావించాలి. రెజ్యూమ్‌లో మన అనుభవం, ఇతర అంశాలను పొందుపర్చినప్పుడు వాస్తవ సమాచారాన్ని మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. మీరిచ్చే సమాచారాన్ని వెరిఫై చేస్తే అది తప్పని తేలితే ఉద్యోగానికి ఎంపిక చేయరు. అందుకే వాస్తవ సమాచారాన్ని మాత్రమే బయోడేటాలో పొందుపర్చాలి. వ్యక్తి యొక్క ప్రవర్తన, అప్పియరెన్స్ చాలా ముఖ్యం.
ఇంటర్వ్యూ సమయంలో వారడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలి. మనకు సమాధానం తెలియని వాటికి మోహమాటపడకుండా తెలియదని చెప్పడం ఉత్తమం. తెలియనివాటికి తెలిసినట్లుగా ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తే మనలో డొల్లతనం బయటపడుతుంది. అందుకే తెలిస్తే తెలుసని.. లేకపోతే ఐ డోంట్ నో అని చెప్పడం ఉత్తమం. కంపెనీలో ఉద్యోగానికి సంబంధించిన ప్రొఫైల్ స్పష్టంగా తెలుసుకోవాలి. మీరు ఏం చేయగలరు.. ఏం చేయలేరనేది స్పష్టం చేయాలి. అలా చేయడంతో పాటు.. స్పష్టంగా ప్రశ్నలు సమాధానమిస్తే దాదాపు 70 శాతం మనం ఇంటర్వ్యూలో సక్సెస్ అయినట్లే.. అందుకే ఇంటర్వ్యూకు వెళ్లే వాళ్లు ఈ చిట్కాలు పాటిస్తే ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది.
Read Also: ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా.. ప్రభుత్వ ఆలోచన ఇదేనా..
Follow us on: Youtube, Instagram, Google News