25.2 C
Hyderabad
Tuesday, October 3, 2023
spot_img

ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా.. ప్రభుత్వ ఆలోచన ఇదేనా..

AP Early Elections |ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే ఛాన్స్‌ ఉందంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో ముందస్తు ఎన్నికల విషయం చర్చించారనే ప్రచారం జరిగింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా.. వద్దా అనేది పూర్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు.. అధికార వైసీపీ పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దీనికి బీజేపీ పెద్దల అనుమతి అవసరం ఉండదు.. కాని ఏపీలో మాత్రం బీజేపీ, వైసీపీ ఒకటనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. బీజేపీ, వైసీపీ పరోక్షంగా కలిసి పని చేస్తున్నాయా.. జగన్‌కు ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయా అనడానికి ఆధారాలు మాత్రం కన్పించవు. కొన్ని సంఘటన ఆధారంగా బీజేపీ, వైసీపీ కలిసే ఉన్నాయనే ఓ ప్రచారం మాత్రం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో అసలు ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయా.. జగన్‌ ఆ నిర్ణయం తీసుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

రాజకీయాల్లో అన్ని రోజులు ఒకేలా ఉండవు.. పోలింగ్‌కు ఒకరోజు ముందు కూడా సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. అందుకే ఒకోసారి ఎన్నో అద్భుతాలను చూస్తూ ఉంటాం. మమతా బెనర్జీ వంటి నాయకురాలే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సందర్భాన్ని ఇటీవల కాలంలో చూశాం. అందుకే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇదే సందర్భంగా రాజకీయ పార్టీలకు తమ తమ వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాల ప్రకారం ఎన్నికలకు వెళ్తుంటాయి. ముందస్తు ఎన్నికలు అంటే సాధారణంగా ఏడాది ముందు జరిగితే కలిగే లాభం ఏమిటనే ఆలోచన సామాన్య మనిషికి కలుగుతుంది. కాని అనేక అంశాల్లో తేడాలు స్పష్టంగా కన్పిస్తాయి. ఉదాహరణకు తెలంగాణలో 2019లో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. అసెంబ్లీ రద్దు చేసి ఆరు నెలలకు ముందే కేసీఆర్‌ శాసనసభ ఎన్నికలకు వెళ్లారు. దీంతో ఎవరూ వూహించని విధంగా ప్రస్తుత బీఆర్‌ఎస్‌.. అప్పటి టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. అదే 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఫలితం భిన్నంగా ఉంది. శాసనసభ ఎన్నికల్లో ఒకే ఒక ఎమ్మెల్యే స్థానం గెలిచిన బీజేపీ లోక్‌ సభ ఎన్నికల్లో మాత్రం నాలుగు ఎంపీ స్థానాలు గెల్చుకుని అందరి అంచనాలను తలకిందులు చేసింది. సరిగ్గా గతంలో కేసీఆర్‌ చేసిన ఆలోచనే ప్రస్తుతం జగన్‌ చేస్తున్నారనే ఓ ప్రచారం సాగుతోంది.

AP Early Elections |ఆంధ్రప్రదేశ్‌ లో షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఎన్నికలు జరగాలి. కాని ఆరు నుంచి ఎనిమిది నెలల ముందే ఎన్నికలకు వెళ్లడం ద్వారా.. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా ఉండేలా చూసుకోవచ్చనే అభిప్రాయం ఒకటైతే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి పొత్తులపై ఓ అవగాహన రాకపోవడంతో.. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే ధోరణిలో వైసీపీ ఉన్నట్లు అర్థమవుతోంది. ఎన్నికలంటే అవునన్నా.. కాదన్న ఖర్చుతో కూడుకున్నవి.. అభ్యర్థి ఎంత బలవంతుడైనా.. ఆర్థికంగానూ బలంగా ఉండాలి.. అభ్యర్థి ఆర్థిక బలవంతుడు కాకపోతే.. పార్టీయే డబ్బు సమకూర్చాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఫైనాన్షియల్‌గానూ విపక్ష పార్టీలకు సమస్య ఉంటుంది. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరిగితే అనేక అంశాల్లో విపక్షాలు జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది. అయితే ఇతర పార్టీలకు ఆ అవకాశం ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా కొంత ప్రయోజనం పొందవచ్చనే ఆలోచనతోనే జగన్‌ ముందస్తు ఆలోచన చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి గల మరిన్ని కారణాలను పరిశీలిస్తే.. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ నలుగురుని పార్టీ కూడా సస్పెండ్‌ చేసింది. అయితే మరింత మంది ఎమ్మెల్యేలు అసమ్మతితో ఉన్నారని.. ఎన్నికల సమయానికి ఈ అసమ్మతి బయటపడే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి బయటపడకముందే ఎన్నికలకు వెళ్లాలనే ప్లాన్‌లో జగన్‌ ఉన్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీ ఇప్పటికే ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని పెట్టాలనే విషయంలో క్లారిటీతో ఉంది.. ప్రతిపక్ష టీడీపీ, జనసేనలకు సంబంధించి అనేక ఆశావహుల సంఖ్య ఎక్కువుగానే ఉంది. ఒకరికి టికెట్‌ ఇస్తే.. టికెట్‌ ఆశిస్తున్న మరొకరు రెబల్‌గా మారితే ప్రతిపక్షాలు ఇరుకునపడే అవకాశం ఉంది. పొత్తులు పెట్టుకుంటే ఇరు పార్టీలు కొన్ని స్థానాల్లో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఆ త్యాగాలకు నియోజకవర్గం నేతలు ఎలా స్పందిస్తారనేది కూడా కీలకమైన అంశం అవుతుంది. అందుకే విపక్షాలకు ఎక్కువ సమయం ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా ఎంతో కొంత తమకు కలిసొస్తుందనే ఆలోచనలో వైసీపీ ఉందని అంటున్నారు రాజకీయాలపై ఎంతో కొంత అవగాహన ఉన్నవారు. మరి జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా.. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Read Also: మారుతున్న రాజకీయ సమీకరణాలు.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..

Follow us on:   YoutubeInstagramGoogle News

Latest Articles

అక్టోబర్ 13న ఆర్ నారాయణమూర్తి ‘యూనివర్సిటీ’

స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్‌లో ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్