ఇటు బొగ్గు గనులు, అటు సున్నపురాతి గనులు.! తెలంగాణలో ఇప్పుడు ఇవే హాట్ టాపిక్‌గా మారాయి. కేంద్ర గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం చోటు చేసుకున్న ఈ పరిణా మాలు పొలిటికల్‌గానూ కాక పుట్టిస్తున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలేలా చేస్తు న్నాయి.
సింగరేణి భవితవ్యం ప్రశ్నార్థకమేనా..? బొగ్గు గనులు ప్రైవేటు పరమవుతున్న వేళ ఇప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో సింగరేణి ఉనికే ఉండదని వాపోతున్నారు కార్మికు లు. అటుసున్నపురాయి గనుల విషయంలోనూ ఇదే సీన్. దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మొదటగా సింగ రేణి గనుల వేలం అంశాన్ని పరిశీలిస్తే, పదో విడత బొగ్గు గనుల వేలంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 60 బొగ్గు బ్లాక్‌లను ఇటీవలె కేంద్రం వేలం వేసింది. ఇందులో తెలంగాణకు చెందిన శ్రావణపల్లి గని సైతం ఉండడంతో వివాదం రాజుకుంది. ఈ బ్లాకులో సుమారు 12 కోట్ల టన్నుల మేర బొగ్గు నిల్వలు ఉన్నట్లు గతంలోనే సింగరేణి నిర్వహించిన అన్వేషణలో తేలింది. ఈ నేపథ్యంలోనే సింగరేణి సంస్థ సైతం ఈ వేలంలో పాల్గొంది. దీంతో ఇప్పుడు వేలంపాటలో ఆ బ్లాక్ ఎవరికి దక్కుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది.
ఈ గనుల వేలమే తెలంగాణలో రాజకీయంగా మాటల యుద్ధానికి దారితీసింది. సింగరేణికి కొత్తగా గనులు కేటాయిం చాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క. లేదంటే భవిష్యత్‌లో సింగరేణి మూతపడే పరిస్థితి వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో కేంద్ర సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు మల్లు భట్టి. అదే సమయంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే రెండు గనులను వేలం వేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. బొగ్గు బ్లాకులను ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వకుండా సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలన్నదే బీజేపీ లక్ష్యమని ఆరోపిస్తోంది గులాబీ పార్టీ. ఈ విషయంలో కమలం పార్టీతో కాంగ్రెస్ కూడా కుమ్మక్కైం దని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను వేలంలో ఎవరికీ కేటాయించకుండా సింగరేణికే ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ విషయంలో తమ పార్టీ తరఫున భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సైతం ఆందోళన చేయనున్నట్లు పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు కేటీఆర్. 137 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర సింగరేణి సొంతం. దక్కన్ కంపెనీ పేరుతో తొలినాళ్లలో బొగ్గు తవ్వకాలు జరగగా 1921లో దక్కన్ కంపెనీని ఇంగ్లాండ్ నుంచి మద్రాస్ తరలించి సింగరేణి కాలరీస్ లిమిటెడ్‌గా పేరు మార్చారు. అప్పటి నుంచి మెల్లగా దీని విస్తరణ ప్రారంభమైంది. ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో అతిపెద్ద ఉత్పాదక సంస్థగా సింగరేణి ఉంది. ఇది మూత పడే పరిస్థితే వస్తే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపడంతోపాటు ఉపాధిపైనా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీంతో వివిధ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవు తోంది.
బొగ్గు గనుల వేలం వ్యవహారం ఓవైపు వేడి రాజేస్తుంటే మరోవైపు సున్నపురాయి గనుల వేలం మంటపు ట్టిస్తోంది. తెలంగాణలోని సున్నపురాయి గనుల వేలానికి డెడ్‌లైన్‌తో కూడిన లేఖ రాస్తూ కేంద్రం ఇటీవలె ఆదేశాలు జారీ చేయడం మరింత హీట్‌ను పెంచింది. రాష్ట్రంలోని 11 గనులను వేలం వేయడానికి మోడీ సర్కార్ నోటిఫై చేసింది.అందులో ఆరింటిని ఈ నెల 30లోగా పూర్తి చేయాలని, లేదంటే తామే రంగంలోకి దిగుతామని హెచ్చరిస్తూ లేఖ రాసింది. అయితే, ఈ ఖనిజాలను ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకోవాలన్న యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఉన్న సైదులనామా, సుల్తాన్‌పూర్, పుసుపులబోడు, ఖమ్మం జిల్లాలోని చింతలతాండ, ఆదిలాబాద్ జిల్లాలోని కంపజునపాని తదితర ప్రాంతా ల్లో ఈ సున్నపురాయి నిక్షేపాలున్నాయి. ఇంతకాలం వీటిని వేలం వేయకపోవడంతో 2024 మే 20న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర గనుల శాఖ లేఖ రాసింది. వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని అందులో కోరింది. వీటిలో కనీసం ఆరు గనులనైనా ఈ నెల 30వ తేదీలోగా వేలం వేయాలని గడువు విధించింది. లేని పరిస్థితుల్లో తామే రంగంలోకి దిగుతామని స్పష్టం చేసింది. గనులు, ఖనిజాల అభి వృద్ధి-నియంత్రణ చట్టంలోని సెక్షన్-10 బీ, 11 ప్రకారం తామే వేలం వేసి ప్రైవేటు కంపెనీలకు అప్పగి స్తామని తెలిపింది. అయితే గత నెలలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం అంతగా ఫోకస్ చేయలేదు. కానీ కేంద్రం విధించిన గడువు దగ్గరపడటంతో రేవంత్ సర్కార్ గనుల వేలం, కేంద్రం లేఖపై సమీక్ష నిర్వహించింది.
రాష్ట్రంలోని మూడు సున్నపురాయి గనులను వేలం వేయాలని 2018లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట జిల్లాలోని పసుపులబోడు, సైదులనామా, సుల్తాన్‌పూర్ సున్నపురాయి గనుల వేలానికి సన్నాహాలు చేసింది. అందుకు అనుమతించాలంటూ 2020 సెప్టెంబరు 16న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. అందుకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం వేలానికి అనుమతిస్తూ 2021 డిసెంబరు 12న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యుత్తరమిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినందున కేంద్రం ముందస్తు అనుమతి అవసరం లేదని, వేలం ప్రక్రియను కొనసా గించాలని అందులో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గనులు, ఖనిజాల వేలం ప్రక్రియ ఏయే దశ ల్లో ఉందో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం కొంతకాలం క్రితం అన్ని రాష్ట్రాలనూ ఆరా తీసింది. ఈ సమా చారం ఆధారంగా 2015 కొత్త చట్టం ద్వారా చేపట్టిన వేలం విధానంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 354 భారీ ఖనిజాల గనులను ఇటీవల వేలం వేసింది. ఈ క్రమంలోనే సున్నపురాయి గనుల వేలంపై కూడా ఫోకస్ పెట్టిన కేంద్రం ఈ నెలాఖరులోగా వేలం ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే డెడ్‌లైన్ దగ్గర పడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖనిజాలను ప్రైవేట్ పరంకాకుండా చూసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోను న్నాయి అన్నది ఆసక్తి రేపుతోంది. మొత్తంగా చూస్తే, ఇటు బొగ్గు గనుల వ్యవహారం, అటు సున్నపురాయి అంశం రాష్ట్ర రాజకీ యాల్లో హీట్‌ను అమాంతం పెంచేశాయన్న వాదన విన్పిస్తోంది.


