కాంగ్రెస్ వైపు జగన్ చూపు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ అడుగులపై సరికొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారని, బీజేపీతో బంధం తెంచుకుంటున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో బెంగళూరులో జరిగిన రహస్య భేటీలు, ఇటీవల జగన్ చేసిన కాక్రోచ్ వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే, తనను జైలుకు పంపిన కాంగ్రెస్‌తో జగన్ నిజంగానే చేతులు కలుపుతారా? దశాబ్దాలుగా కాపాడుకుంటున్న సొంత ఓటు బ్యాంకును హస్తం పార్టీకి జగన్ బలివేస్తారా?

షల్ మీడియా వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ మూవ్‌మెంట్‌పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆయన క్రమంగా భారతీయ జనతా పార్టీకి దూరమవుతూ, కాంగ్రెస్ పార్టీకి చేరువవుతున్నారనే ఒక సరికొత్త నెరేటివ్‌ను కొందరు నెట్టింట బలంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్రంలో తాము ‘కాక్రోచ్‌’ల మాదిరిగా ఎప్పుడూ బ్రతికే ఉంటామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి ప్రధాన ట్రిగ్గర్ అయ్యాయి. ‘బొద్దింక’ సిద్ధాంతం పేరుతో ఆయన చేసిన కామెంట్లను పట్టుకుని, ఆయన కాంగ్రెస్ భావజాలానికి దగ్గరవుతున్నారనే వాదనను తెరపైకి తెచ్చారు. దీనికి తోడు బెంగళూరులోని తన నివాసంలో జగన్ గడుపుతున్న సమయంలో.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అగ్ర నేత డీకే శివకుమార్‌తో అంతర్గత భేటీలు జరిపారనే వార్తలు ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశాయి.

కర్ణాటకలో డీకే శివకుమార్ ట్రబుల్ షూటర్‌గా ఎదగడం, ఆయనతో జగన్‌కు ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం ఈ రాజకీయ ప్రచారానికి కేంద్రబిందువుగా మారాయి. జాతీయ స్థాయిలో బీజేపీపై వ్యక్తమవుతున్న ప్రజా వ్యతిరేకతను గమనించే జగన్ రూట్ మార్చారనే విశ్లేషణలను కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు కర్ణాటక నుంచి రాజ్యసభ స్థానం దక్కకుండా చేయడం వెనుక జగన్, డీకే శివకుమార్ ఉమ్మడి వ్యూహం ఉందనే ఒక బలమైన ప్రచారం రాజకీయ వర్గాల్లో నడిచింది. షర్మిలకు చెక్ పెట్టడానికే డీకే ద్వారా జగన్ పావులు కదిపారని, తద్వారా కాంగ్రెస్ హైకమాండ్‌కు జగన్ పరోక్షంగా సహకరిస్తున్నారనే వాదనలను తెరపైకి తెచ్చారు. ఏపీలో విపక్షంగా ఉన్న వైసీపీపై జరుగుతున్న రాజకీయ దాడులను ఎదుర్కోవడానికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గొడుగు కిందకు వెళ్లడమే సురక్షితమని జగన్ భావిస్తున్నట్లుగా సోషల్ మీడియా హ్యాండిల్స్ కథనాలు అల్లుతున్నాయి.

అయితే ఈ ప్రచారంలో క్షేత్రస్థాయి వాస్తవాలను, జగన్ రాజకీయ చరిత్రను నిశితంగా పరిశీలిస్తే ఇదంతా కేవలం ఒక పొలిటికల్ ఫిక్షన్ అని స్పష్టమవుతుంది. వైఎస్ జగన్ రాజకీయ సిద్ధాంతం మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల పైనే నిర్మితమై ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే కాంగ్రెస్ హైకమాండ్ నిరంకుశ వైఖరిపై ధిక్కార స్వరంగా మొదలైంది. సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చిన జగన్.. తనను పద్నాలుగు నెలల పాటు జైలు పాలు చేసిన కాంగ్రెస్ పార్టీతో జీవితంలో చేతులు కలిపే ప్రసక్తే ఉండదని విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు ఆయన ఏ జాతీయ పార్టీతోనూ ప్రత్యక్ష పొత్తు పెట్టుకోలేదు. 2014, 2019, 2024 ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడారు. కాంగ్రెస్‌తో జట్టు కడితే తన రాజకీయ అస్తిత్వాన్నే స్వయంగా కాలరాసుకున్నట్లు అవుతుందనే కనీస లాజిక్ జగన్‌కు తెలుసన్న చర్చ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న పటిష్టమైన ఓటు బ్యాంకు వెనుక అతిపెద్ద చారిత్రక కారణం ఉంది. ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు శాశ్వతంగా పక్కన పెట్టేశారు. ఆ సమయంలో కాంగ్రెస్‌కు దూరమైన సాంప్రదాయ ఓటు బ్యాంకు మొత్తాన్ని జగన్ స్వయంకృషితో వైసీపీ వైపు మళ్లించుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే కాంగ్రెస్ పార్టీతో జగన్ చేతులు కలుపుతారని భావించడం రాజకీయ అవగాహనారాహిత్యమే అవుతుంది. ఒకవేళ జగన్ ఆ సాహసం చేస్తే, రెండు దశాబ్దాలుగా తాను కష్టపడి నిర్మించుకున్న ఓటు బ్యాంకును తిరిగి కాంగ్రెస్‌కు ప్లేట్‌లో పెట్టి ఇచ్చినట్లు అవుతుంది. అంతేకాకుండా జగన్ ఎప్పుడూ కేవలం ఏపీ ప్రయోజనాలకే పరిమితం అవుతారు తప్ప, తెలంగాణ రాజకీయాల వైపు గానీ, జాతీయ స్థాయి కూటముల వైపు గానీ దృష్టి సారించరు. రాష్ట్ర విభజనకు కారణం అయిన కాంగ్రెస్‌ను కౌగిలించుకుని ఏపీలో రాజకీయంగా ఆత్మహత్య చేసుకునేంత సాహసం జగన్ చేయరన్న విశ్లేషణలు జరుగుతున్నాయి.

ప్రస్తుత జాతీయ రాజకీయ సమీకరణాల్లో భారతీయ జనతా పార్టీ అత్యంత శక్తివంతమైన స్థానంలో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్‌ను కాదని, బలహీనంగా ఉన్న కాంగ్రెస్ వైపు వెళ్లేంత ‘రాంగ్ స్టెప్’ జగన్ వేయరన్నది నూటికి నూరు శాతం వాస్తవం. మొదటి నుంచి వైఎస్ జగన్ భారతీయ జనతా పార్టీకి ‘అప్రకటిత మిత్రుడి’గానే మెలుగుతున్నారు. పార్లమెంటులో కీలక బిల్లుల సమయంలో బీజేపీకి వైసీపీ బేషరతు మద్దతు ఇచ్చిన చరిత్ర ఉంది. కేంద్రంలోని పెద్దలతో సత్సంబంధాలు నెరపడమే జగన్ ముందున్న సురక్షితమైన రాజకీయ మార్గం. భవిష్యత్తులో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మునుపటి లాగే ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. ఒకవేళ ఎన్నికల ఫలితాల అనంతరం జాతీయ స్థాయిలో ఏదైనా పొత్తు అనివార్యమైన పరిస్థితి వస్తే.. జగన్ కచ్చితంగా కమలనాథులతోనే చేతులు కలుపుతారు. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వరన్నది తిరుగులేని సత్యం. మరి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్